ఆశా కార్యకర్తలకు వేతనంతో ప్రసూతి సెలవులు

ఆశా కార్యకర్తలకు, ఏఎన్‌ఎం-2లకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇచ్చేలా సమగ్ర అధ్యయనం చేసి నివేదిక అందించాలని మంత్రి హరీశ్‌రావు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ శ్వేతామహంతిని ఆదేశించారు.

Updated : 06 Jun 2023 04:33 IST

అధ్యయనం చేసి నివేదిక  ఇవ్వాలని ఆదేశం
వైద్య, ఆరోగ్యశాఖ నెలవారీ  సమీక్షలో మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: ఆశా కార్యకర్తలకు, ఏఎన్‌ఎం-2లకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇచ్చేలా సమగ్ర అధ్యయనం చేసి నివేదిక అందించాలని మంత్రి హరీశ్‌రావు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ శ్వేతామహంతిని ఆదేశించారు. సోమవారం ఆశాలు, ఏఎన్‌ఎంలతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఆశాలు, ఏఎన్‌ఎంలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ‘‘ మునుపెన్నడూ లేనివిధంగా అత్యధిక ప్రసవాలతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు మొదటి స్థానంలో నిలిచాయి. సంగారెడ్డి, నారాయణపేట, మెదక్‌, జోగులాంబ గద్వాల జిల్లాలకు ప్రత్యేకాభినందనలు. రాష్ట్ర సగటు కంటే తక్కువ ప్రసవాలు నమోదు చేస్తున్న జిల్లాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. సిజేరియన్‌లు ఎక్కువగా నమోదవ్వడంతోపాటు ఇతర అంశాల్లోనూ తక్కువ పనితీరు కనబరుస్తున్న కరీంనగర్‌ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. మెటర్నిటీ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపి వారంపాటు పరిశీలన చేయాలి. ఇమ్యూనైజేషన్‌(టీకాల పంపిణీ) తక్కువగా నమోదవుతున్న సూర్యాపేట జిల్లాకు ఇమ్యూనైజేషన్‌ విభాగం జేడీని పరిశీలనకు పంపి తగిన చర్యలు తీసుకోవాలి. మెటర్నరీ హెల్త్‌(తల్లి ఆరోగ్యం) పనితీరులో చివరి స్థానంలో ఉన్న వనపర్తి, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, సూర్యాపేట జిల్లాల్లో పురోగతి కనిపించాలి. కనిష్ఠ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్న 53 ఆరోగ్య ఉపకేంద్రాల పనితీరు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలి’’ అని మంత్రి ఆదేశించారు. ప్రజారోగ్యంలో రాష్ట్రం సాధించిన అద్భుతమైన ప్రగతిని శాఖల వారీగా వివరిస్తూ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్‌ 14న నిర్వహించే వైద్య, ఆరోగ్య దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని