పరిశోధనలు, ఆవిష్కరణలతో పరిష్కారం

ఆరోగ్యరంగానికి ఎదురవుతున్న సవాళ్లకు వినూత్న పరిష్కారాల కోసం పరిశోధనలు, ఆవిష్కరణలు పెద్దఎత్తున సాగాలని కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ సహాయ మంత్రి భగవంత్‌ ఖుబా అన్నారు.

Published : 06 Jun 2023 03:33 IST

కేంద్ర ఎరువులు, రసాయనాల సహాయ మంత్రి భగవంత్‌ ఖుబా

ఈనాడు, హైదరాబాద్‌: ఆరోగ్యరంగానికి ఎదురవుతున్న సవాళ్లకు వినూత్న పరిష్కారాల కోసం పరిశోధనలు, ఆవిష్కరణలు పెద్దఎత్తున సాగాలని కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ సహాయ మంత్రి భగవంత్‌ ఖుబా అన్నారు. ఇందులో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు భాగస్వాములు కావాలని, తద్వారా వనరులు, నైపుణ్యాన్ని సమీకరించడంతో పాటు పరిశోధన, ఆవిష్కరణలు వేగవంతమవుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన జీ20 మూడో కార్యబృందం (వర్కింగ్‌ గ్రూపు) సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘‘ప్రస్తుతం ఉన్న ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ఎదుర్కొనవచ్చు. ప్రపంచ ఔషధరంగంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది. మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించడంలో భారత ఔషధ సంస్థలు ముందంజలో ఉన్నాయి. ప్రపంచ టీకాల సరఫరాలో 60 శాతం వాటా, జనరిక్‌ ఎగుమతుల్లో 20-22 శాతం వాటా కలిగి ఉంది. దాదాపు 200 దేశాలకు ఇక్కడి ఉత్పత్తులు వెళుతున్నాయి’’ అని కేంద్రమంత్రి తెలిపారు. సమావేశంలో నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజీవ్‌ బహల్‌, అదనపు కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌, విదేశీ వ్యవహారాలశాఖ అదనపు కార్యదర్శి అభయ్‌ ఠాకూర్‌, కేంద్ర ఆహారభద్రత ప్రమాణా ప్రాధికార సంస్థ సీఈవో జి.కమలవర్ధనరావు, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని