TSLPRB: తప్పులు సరిదిద్దుకునేందుకు చివరి అవకాశం

పోలీసుశాఖలో ఉద్యోగాలకు పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు చివరి అవకాశం ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు.

Updated : 06 Jun 2023 10:18 IST

పోలీసు ఉద్యోగార్థులకు నియామక మండలి నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: పోలీసుశాఖలో ఉద్యోగాలకు పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు చివరి అవకాశం ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ సదుపాయం ఈనెల 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం 0.38 శాతం మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారన్నారు. పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టుల కోసం నియామక మండలి నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఇటీవల తుది ఫలితాలు వెల్లడయిన సంగతి తెలిసిందే. దీంతో నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కటాఫ్‌ మార్కులు ప్రకటించడమే తరువాయి. ఈ దశలో అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏవైనా తప్పులు దొర్లి ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు. ఈ తప్పులను మూడు రకాలుగా విభజించారు. ‘ఎ’ కేటగిరీ తప్పులను నియామక మండలి ఉద్యోగుల సమక్షంలో మాత్రమే సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇందులో అభ్యర్థి పేరు, జెండర్‌, కులం, స్థానికత, ఫొటో, సంతకం, వయసు వెసులుబాటు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, క్రీడలకు సంబంధించిన రిజర్వేషన్‌ పొందడం వంటి అంశాలు ఉంటాయి.

‘బి’ కేటగిరీ తప్పులను ధ్రువపత్రాల పరిశీలన సమయంలో సంబంధిత ఎస్పీ, కమిషనర్ల సమక్షంలో సరిదిద్దుకోవచ్చు. అభ్యర్థి ఇంటిపేరు, ఆధార్‌ నంబరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వంటివి ఈ తరగతిలో ఉంటాయి. ఇక అభ్యర్థి లాగిన్‌ ఐడీ వంటివి ‘సి’ కేటగిరీ కిందికి వస్తాయని, వీటిని ఇప్పుడు సరిదిద్దుకోవడం సాధ్యంకాదని ఈ ప్రకటనలో వెల్లడించారు. ‘ఎ’ తరగతి తప్పులకైతే ఎస్సీఎస్టీలు రూ.3 వేలు, ఇతరులు రూ.5 వేలు, ‘బి’ కేటగిరి తప్పులకైతే ఎస్సీఎస్టీలు రూ.2వేలు, ఇతరులు రూ.3వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తమ దరఖాస్తు సరిదిద్దుకోవాల్సిన అభ్యర్థులు వారికి కేటాయించిన లాగిన్‌ ఐడీ ద్వారా నిర్ణీత తేదీల్లో ఈ సదుపాయం వినియోగించుకోవాలని, కేటగిరీని బట్టి ఫీజు చెల్లిస్తే నియామక మండలి సిద్ధం చేసిన టెంప్లెంట్‌ కనిపిస్తుందని, దాన్ని పూర్తి చేసి సబ్మిట్‌ చేయగానే మరో పత్రం వస్తుందని, దాన్ని ప్రింట్‌ తీసుకొని ధ్రువపత్రాల పరిశీలన సమయంలో తమ వెంట తీసుకొని రావాల్సి ఉంటుందన్నారు. రెండు కేటగిరీల్లో తప్పులు సరిదిద్దుకోవాలంటే రెండింటికీ సంబంధించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుందని శ్రీనివాసరావు వివరించారు. తప్పులు దొర్లినట్లు భావిస్తున్న వాటికి సంబంధించిన ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో హాజరుకావాల్సి ఉంటుందని, దీనికి సంబంధించిన తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

అలానే కుల ధ్రువీకరణ పత్రం 2014 జూన్‌ 2, నాన్‌ క్రీమీలేయర్‌ పత్రం 2021 ఏప్రిల్‌ 1, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ధ్రువపత్రం కూడా 2021 ఏప్రిల్‌1 తర్వాత జారీ చేసి ఉన్నవాటిని మాత్రమే అనుమతిస్తామన్నారు.నియామక మండలి నిర్వహించిన అన్ని పరీక్షల్లో రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌లకు సంబంధించి 0.38 వినతులు మాత్రమే వచ్చాయన్నారు. అన్ని పరీక్షలకు కలిపి మొత్తం 3,55,387 జవాబు పత్రాలు ఉండగా వాటిలో కేవలం 1338 జవాబు పత్రాలకు సంబంధించి మాత్రమే రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ల దరఖాస్తులు వచ్చాయని నియామక మండలి ఛైర్మన్‌ తెలిపారు. వ్యాసరూప సమాధానాలకైతే కేవలం జవాబుపత్రంలో వేసిన మార్కులను లెక్కిస్తామని, ఓఎమ్మార్‌ షీట్‌లో అయితే తప్పులు, ఒప్పులు, ఖాళీగా వదిలేసిన వాటిని పరిశీలించి, అభ్యర్థికి సమంజసమైన మార్కులే వచ్చాయా అన్నది పరిశీలిస్తారని శ్రీనివాసరావు వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని