వెలుగుల సంబురాలు

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ రంగ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

Updated : 06 Jun 2023 04:28 IST

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా విద్యుత్‌ విజయోత్సవాలు
స్వరాష్ట్ర సాధనతోనే నిరంతర కరెంటు సరఫరా సాధ్యమైంది
మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ రంగ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన తరవాత నిరంతర కరెంటు సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, తద్వారా సాధించిన ప్రగతిని మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎండీలు ప్రజలకు వివరించారు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎండీలు ప్రభాకరరావు, రఘుమారెడ్డిలు రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి విజయోత్సవ సభలో ఈ రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించారు. అంతకుముందు విద్యుత్‌సౌధలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు మాట్లాడుతూ, తొమ్మిదేళ్లలో రూ.97,321 కోట్ల వ్యయంతో కొత్త విద్యుత్‌ కేంద్రాలు సహా పంపిణీ, సరఫరా వ్యవస్థల నిర్మాణ పనులు చేపట్టడంతో నిరంతర కరెంటు సరఫరా సాధ్యమైందన్నారు. సికింద్రాబాద్‌లో మంత్రి తలసాని విద్యుత్‌ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. వరంగల్‌ కేంద్రంగా నిర్వహించిన సభలో సీఎండీ గోపాలరావు విద్యుత్‌ ప్రగతి ప్రస్తానాన్ని వివరించారు. సూర్యాపేట నియోజకవర్గంలోని వట్టిఖమ్మంపహాడ్‌ సబ్‌స్టేషన్‌ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగించారు. స్వరాష్ట్రంలో విద్యుత్‌ రంగంలో విజయాలు సీఎం కేసీఆర్‌ సృష్టించిన అద్భుతమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లోని దక్షిణ తెలంగాణ డిస్కం ప్రధాన కార్యాలయంలో సీఎండీ రఘుమారెడ్డి అధ్యక్షతన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎండీ ప్రభాకరరావు, ఖైరతాబాద్‌ శాసనసభ్యుడు దానం నాగేందర్‌, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం కృషికి గుర్తింపుగా ప్రభాకరరావు, రఘుమారెడ్డి, సంస్థ డైరెక్టర్లు, ఇతర అధికారులను దానం నాగేందర్‌ సన్మానించారు.


9 ఏళ్లలో ఉచిత విద్యుత్తుకు రూ.36,890 కోట్ల రాయితీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఆవిర్భావం తరవాత విద్యుత్తు రంగంలో విప్లవాత్మక విజయాలు సాధించినట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘విద్యుత్‌ విజయోత్సవాల’ సందర్భంగా ఈ రంగం సాధించిన ప్రగతిపై నివేదిక విడుదల చేసింది. ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు సరఫరా కోసం ప్రభుత్వం ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఇలా 2014 నుంచి 2022 వరకు రూ.36,890 కోట్ల రాయితీ ఇచ్చింది. నిరంతరాయంగా 24 గంటలూ 26.96 లక్షల వ్యవసాయ బోర్లకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ’ అని అందులో పేర్కొంది. రాష్ట్రం ఏర్పడే నాటికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లేనని, నేడది 18,453 మెగావాట్లకు పెరిగిందని పేర్కొంటూ అందుకు జరిగిన కృషి, చేసిన ఖర్చు, కొత్తగా అందుబాటులోకి వచ్చిన థర్మల్‌ కేంద్రాలు తదితరాలను వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని