రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలి

‘చెమట చిందించి, ఎన్నో కష్టాలు అధిగమించి సమాజాన్ని మేల్కొలిపేందుకు కృషి చేసిన ఆచార్య కొలకలూరి ఇనాక్‌ ఆశయాలను నెరవేర్చేలా రచనలు చేయడం, రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించడమే ఆయనకు మనం ఇవ్వగలిగే అసలైన గురుదక్షిణ’ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు.

Updated : 06 Jun 2023 04:29 IST

కొలకలూరి ఇనాక్‌కు జీవన సాఫల్య పురస్కారం, స్వర్ణకంకణ ప్రదానోత్సవంలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘చెమట చిందించి, ఎన్నో కష్టాలు అధిగమించి సమాజాన్ని మేల్కొలిపేందుకు కృషి చేసిన ఆచార్య కొలకలూరి ఇనాక్‌ ఆశయాలను నెరవేర్చేలా రచనలు చేయడం, రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించడమే ఆయనకు మనం ఇవ్వగలిగే అసలైన గురుదక్షిణ’ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. సోమవారం రాత్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో యువకళావాహిని ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త, శ్రీవేంకటేశ్వర వర్సిటీ పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య ఇనాక్‌కు జీవన సాఫల్య పురస్కారం, స్వర్ణకంకణ ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి అధ్యక్షతన జరిగిన సభలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘‘కొలకలూరి ఇనాక్‌ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి కూడా కవిసమ్మేళనాల్లో ప్రభుత్వం మీద చురకలు అంటిస్తూ.. సందేశాత్మకమైన అంశాలు ప్రస్తావించేవారు. విశ్వనాథ, శ్రీశ్రీ, సినారె వంటి కవులున్న సందర్భంలో కూడా తన భావాలను నిర్మొహమాటంగా వ్యక్తీకరించేవారు. ఆయన కవి, నవలాకారుడు, నాటక రచయిత, కథా విమర్శకుడు, అనువాదకుడు, పరిశోధకుడు. ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండటం అరుదు. ‘నా అక్షరాలే నా అశ్రువులు’ అని ఆయన అభివర్ణించారంటే దాని వెనకాల ఉన్న ఆర్ద్రత, నిస్పృహ, నిస్సహాయతలను గుర్తించవచ్చు.కేంద్ర, రాష్ట్రాల సాహిత్య అకాడమీ పురస్కారాలు, జ్ఞానపీఠ వారి మూర్తిదేవి అవార్డు, పద్మశ్రీ వంటి ఎన్నెన్నో గౌరవాలు ఆయనకు ఊరికే దక్కలేదు. నిజాయతీగా ఆయన సాగించిన సుదీర్ఘ సాహిత్య తపస్సుకు అవి ఫలాలు’’ అని అన్నారు.

తాను భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు దేశం నలువైపులా పర్యటించి రాజ్యాంగ సంస్కృతి, హక్కుల గురించి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశానన్నారు. దేశంలో భారత రాజ్యాంగ సంస్కృతిని వ్యాప్తిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే కేవలం తనలాంటి వారి ప్రసంగాలతో రాజ్యాంగ సంస్కృతిని వ్యాప్తిలోకి తేవడం సాధ్యం కాదని, ఆచార్య ఇనాక్‌ చూపిన బాటలో సాహితీవేత్తలు, సాంస్కృతిక సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్‌ అధ్యక్షులు సారిపల్లి కొండలరావు ప్రారంభోపన్యాసం చేయగా, ఏపీ శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కాకి మాధవరావు, సాహితీవేత్త వోలేటి పార్వతీశం మాట్లాడారు. నిర్వాహకులు లంక లక్ష్మీనారాయణ స్వాగతం పలికారు. కొలకలూరి ఇనాక్‌ స్పందించారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పీఠాధిపతి (పరీక్షా విభాగం) ఆచార్య కొలకలూరి మధుజ్యోతి అభినందనలు తెలిపారు. నిర్వహణ కమిటీ సభ్యులు ఎం.ఏహమీద్‌ వందన సమర్పణ చేశారు. అంతకుముందు స్వర్ణయుగ సినీ సంగీత విభావరి ఆకట్టుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని