నగరంలో ప్రతి శనివారం రీథింక్‌ దినం

పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగంలో ఉండటం గర్వకారణమని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 06 Jun 2023 04:30 IST

పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ అగ్రగామి
త్వరలో హైదరాబాద్‌లో వందశాతం మురుగునీటి పునర్వినియోగం
నిధుల ఖర్చు కంటే.. ప్రజల్లో సామాజిక మార్పే ముఖ్యం
ఆస్కీలో రీథింక్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సర్వేలెన్స్‌ లేబొరేటరీలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగంలో ఉండటం గర్వకారణమని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ విషయాన్ని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్మెంటల్‌ సంస్థ తెలిపిందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఖైరతాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా(ఆస్కీ)లో రీథింక్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సర్వేలెన్స్‌ లేబొరేటరీలను మంత్రి ప్రారంభించారు. వీటి నిర్వహణకు సంబంధించి ఆయన సమక్షంలో ఆస్కీతో ప్రభుత్వ అధికారులు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ల కిందట హైదరాబాద్‌ నగరం, రాష్ట్ర భవిష్యత్తు, పాలనపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికి దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. ‘‘ హైదరాబాద్‌ నగరం గ్లోబల్‌ సిటీగా మారాలంటే అనేక అంశాల్లో మరింత పని చేయాల్సి ఉంది. నగర వాసుల్లో ఇల్లు మాత్రమే నాది.. అనే బాధ్యతారాహిత్యం ఉన్నన్ని రోజులు ఎన్ని నిధులు ఖర్చుపెట్టినా ప్రయోజనం ఉండదు. సోఫాలు, పరుపులు, దిండ్లు, కుర్చీల్లాంటి అనేక వస్తువులు నాలాల్లో కనిపిస్తున్నాయి. రెడ్యూజ్‌, రీసైకిల్‌, రీయూజ్‌ అనే ట్రిపుల్‌ ఆర్‌ అంశాన్ని ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడే పట్టణాల్లో మార్పు సాధ్యమవుతుంది.

నగరంలో ప్రతి శనివారాన్ని రీథింక్‌ దినంగా పాటిద్దాం. ఇందుకోసం ఉన్నతాధికారులు సమావేశం ఏర్పాటు చేసి సిబ్బందికి అవసరమైన సూచనలు చేయాలి. హైదరాబాద్‌లో ఉత్పత్తయ్యే తడిచెత్త ద్వారా ఏటా రూ.200 కోట్లకుపైగా ఆదాయం వస్తోంది. నగరంతోపాటు పలు పురపాలికల్లో చెత్త నుంచి బయోగ్యాస్‌ తయారీని ప్రారంభించబోతున్నాం. 141 పురపాలికల్లో రూ.178 కోట్లతో బయో మైనింగ్‌ ప్రారంభించాం. మానవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లనూ ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో దేశంలో వంద శాతం మురుగునీటి పునరుపయోగించే(రీసైకిల్‌) నగరంగా హైదరాబాద్‌ మారబోతోంది. ఆస్కీ ఛైర్మన్‌ పద్మనాభయ్య మాట్లాడుతూ.. పురపాలకశాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ, జలమండలి ఎండీ దానకిషోర్‌ ఆయా సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఆస్కీ సెంటర్‌ డైరెక్టర్‌ ప్రొ.వి.శ్రీనివాసచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, ఆస్కీ కోర్ట్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ ఛైర్మన్‌ రిచర్డ్‌ బి.సల్దన్హా, యునిసెఫ్‌ ఇన్‌ఛార్జి అధికారి సీమాకుమార్‌ పాల్గొన్నారు. అతిథులు ఆస్కీ ఆవరణలో మొక్కలు నాటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని