Telangana University: తెలంగాణ వర్సిటీపై విజిలెన్స్‌

తెలంగాణ విశ్వవిద్యాలయంలో మంగళవారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దాడులు చేపట్టింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో వర్సిటీకి మూడు వాహనాల్లో పది మంది సభ్యుల బృందం చేరుకుంది.

Updated : 07 Jun 2023 08:05 IST

సోదాలు నిర్వహించిన పదిమంది బృందం
దస్త్రాలు, హార్డ్‌ డిస్క్‌ల స్వాధీనం
హైదరాబాద్‌ వెళ్తున్న వీసీ వాహనం అడ్డగించి తనిఖీ

ఈనాడు, నిజామాబాద్‌ - న్యూస్‌టుడే, తెవివి క్యాంపస్‌: తెలంగాణ విశ్వవిద్యాలయంలో మంగళవారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దాడులు చేపట్టింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో వర్సిటీకి మూడు వాహనాల్లో పది మంది సభ్యుల బృందం చేరుకుంది. పరిపాలనా భవనంలో పలు విభాగాల కార్యాలయాల్లో దస్త్రాలు, కంప్యూటర్లను వారు పరిశీలించారు. అకౌంట్స్‌, వర్సిటీ నిర్వహణ, ఇంజినీరింగ్‌, పరీక్షల విభాగం, ఏవో కార్యాలయాల్లో తనిఖీల అనంతరం కొన్ని రికార్డులతో పాటు కంప్యూటర్‌ సీపీయూలు, హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. గడిచిన రెండేళ్ల బ్యాంకు లావాదేవీల స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. రాత్రి 8:30 వరకు తనిఖీలు కొనసాగాయి. ఆయా విభాగాల్లోని కొందరు సిబ్బంది అక్కడే ఉండిపోయారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, ఫొటోలు తీయకుండా వారి సెల్‌ఫోన్‌లను అధికారులు పక్కన పెట్టించారు. రామచంద్రాపురం సర్కిల్‌ అదనపు ఎస్పీ ఎం.శ్రీనివాస్‌ నేతృత్వంలో పది మంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద వీసీ వాహనం నిలిపివేత...

ఉదయం వీసీ ఆచార్య రవీందర్‌ తన ఛాంబర్‌లోనే ఉన్నారు. విజిలెన్స్‌ అధికారులు రావడానికి ముందు తన వసతి భవనంలోకి వెళ్లారు. విజిలెన్స్‌ అధికారులు ఆయన పీఏ సవితతో మాట్లాడారు. ఛాంబర్‌లో తనిఖీ చేయాల్సి ఉందని తెలియజేసినా,  ఆమె హడావుడిగా అక్కడి నుంచి వీసీ ఉన్న వసతి భవానికి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత వీరిద్దరూ హైదరాబాద్‌ బయలుదేరారు. సమాచారం అందుకున్న విజిలెన్స్‌ అధికారులు భిక్కనూరు టోల్‌ప్లాజా సిబ్బందికి ఫోన్‌ చేసి వీసీ ప్రయాణిస్తున్న వాహనం నంబరు చెప్పి ఆపాలని సూచించారు. అరగంటలో విజిలెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని వీసీతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలతోనే తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. వీసీ సూచనతో వాహనంలోని బ్యాగులో ఉన్న పత్రాలు పీఏ తీసుకుని టోల్‌ప్లాజా నిర్వాహకుల భవనంలోకి వెళ్లి చూపించారు. వాటిలో కొన్నింటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలకు సుమారు 2 గంటలు పట్టింది. వీసీ నియమించిన రిజిస్ట్రార్‌ ఆచార్య కనకయ్యను విజిలెన్స్‌ అధికారులు తనిఖీల ప్రదేశానికి పిలిపించారు. మొదట ఆయన రెండు గంటలు ఉండి బయటికొచ్చారు.  కాసేపటికి మళ్లీ పిలిపించారు. ఈసారి కొంతసేపు మాట్లాడి బయటకు వచ్చేశారు. వారు కొన్ని విషయాలు అడిగారని, తనకు తెలిసింది చెప్పానంటూ వెళ్లిపోయారు.

ఈసీ ఫిర్యాదు నేపథ్యంలోనే..

వర్సిటీలో గడిచిన రెండేళ్లలో వీసీకి, పాలకమండలి(ఈసీ)కి మధ్య విభేదాలున్నాయి. ఏడాదిన్నరగా ఈసీ సమావేశాలు జరగలేదు. ఈ సమయంలో చేసిన ఖర్చుల్లో అక్రమాలు జరిగాయనేది ఆరోపణ.  నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు, పదోన్నతులు జరిగాయని మీడియాకు ఈసీ సభ్యులు ప్రకటన విడుదల చేశారు. అక్రమాలపై విచారణ జరపాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఏసీబీ విభాగాలకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికీ నివేదిక పంపారు. ఈ క్రమంలోనే మంగళవారం తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది.

ఇలా చేయటం సరికాదు

దీనిపై వర్సిటీ వీసీ ఆచార్య రవీందర్‌ స్పందిస్తూ తానంటే గిట్టక కళాశాల విద్య కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌ ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. ‘‘విశ్వవిద్యాలయం స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది. వీరేమో ఎలాంటి సమాచారం లేకుండా వచ్చి తనిఖీలు చేస్తున్నారు. నా వాహనాన్ని గంటకు పైగా హైవేపై ఆపి బ్యాగులో పత్రాలు తీసుకున్నారు. నేను హాజరుకాకున్నా పాలకమండలి చేసిన తీర్మానాల పత్రాలు, వాటిని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లిన పత్రాలు, ఇటీవల రిజిస్ట్రార్లుగా నియమించిన నిర్మలాదేవి, కనకయ్య ఆర్డర్‌ కాపీలు, మరికొన్ని పత్రాలు అందులో ఉన్నాయి.’’ అని ‘ఈనాడు’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని