1 Lakh for BCs: రూ.లక్ష ఆర్థిక సాయం.. ప్రక్రియ ప్రారంభం

వెనుకబడిన వర్గాల్లోని కులవృత్తులు, చేతివృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న రూ.లక్ష ఆర్థిక సాయానికి సంబంధించిన ప్రక్రియ షురూ అయింది.

Updated : 07 Jun 2023 07:40 IST

కులవృత్తిదారులూ... దరఖాస్తు చేసుకోండి
20 వరకు ఆన్‌లైన్‌లో అర్జీల నమోదుకు అవకాశం
9న మంచిర్యాలలో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా లాంఛనంగా పంపిణీ ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: వెనుకబడిన వర్గాల్లోని కులవృత్తులు, చేతివృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న రూ.లక్ష ఆర్థిక సాయానికి సంబంధించిన ప్రక్రియ షురూ అయింది. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడానికి వీలుగా అధికారులు ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. మంగళవారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలవగా ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సంబంధిత వెబ్‌సైట్‌ను సచివాలయంలో మంగళవారం మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఈనెల 9న ఈ కార్యక్రమాన్ని మంచిర్యాలలో లాంఛనంగా ప్రారంభిస్తున్నామని, అదే రోజు అన్ని నియోజకవర్గాల్లో ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని మంత్రి వెల్లడించారు. ‘‘గత క్యాబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం వెనుకబడిన వర్గాల కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయంపై విధివిధానాలను ఖరారు చేసింది. ఫొటో, ఆధార్‌, కుల ధ్రువీకరణపత్రం తదితర 38 కాలమ్స్‌కు సంబంధించిన వివరాలతో దరఖాస్తు పత్రాన్ని సరళంగా రూపొందించాం. దరఖాస్తులను ఆయా జిల్లాల అధికార యంత్రాంగాలతో పరిశీలన చేయించి లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. చేతివృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపి, వారికి ఆర్థిక భరోసాను అందించడంతోపాటు గౌరవప్రదమైన జీవనం కొనసాగించేందుకు సీఎం కేసీఆర్‌ నిరంతరం తపన పడుతుంటారు. ఈ పథకం ద్వారా వారి జీవితాల్లో ఆర్థిక స్వావలంబనకు అవకాశం ఏర్పడుతుంది. లబ్ధిదారులు వృత్తి పరికరాలు, ముడిసరకులు కొనడానికి ఈ నిధులు ఉపయోగపడుతాయి’’ అని మంత్రి గంగుల తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్‌ ఎండీ మల్లయ్య బట్టు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఇవీ విధి విధానాలు:

* వెనుకబడిన కులాలు, చేతివృత్తులకు చెందిన వారంతా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

* ఎంచుకున్న వృత్తిలో రాణించడానికి వీలుగా ఒక్కో లబ్ధిదారుడికి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తారు.

* ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

*  2023 జూన్‌ 2 నాటికి 18-55 ఏళ్ల మధ్య వయస్కులు మాత్రమే అర్హులు.

* లబ్ధిదారుడి వార్షిక ఆదాయం గరిష్ఠంగా గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు మించకూడదు.

* గత అయిదేళ్లలో ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా రూ.50 వేలు అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఇప్పటికే పొందిన లబ్ధిదారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

* ఈనెల 6 నుంచి 20 తేదీ వరకు https://tsobmmsbc.cgg.gov.in   వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

* మండల స్థాయిల్లో ఎంపీడీఓలు, పురపాలికల్లో మున్సిపల్‌ కమిషనర్లు ఈనెల 20 నుంచి 26 వరకు దరఖాస్తులను పరిశీలించాలి.

* జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీ జిల్లాస్థాయిలో ఎంపిక పూర్తి చేయాలి. దీనికి సంబంధించిన అనుమతులను ఈనెల 27 నుంచి జులై 4 వరకు సంబంధిత జిల్లా ఇన్‌ఛార్జి మంత్రుల ద్వారా పొందాలి.

* లబ్ధిదారులను దశల వారీగా ఎంపిక చేసి, ఆ సమాచారాన్ని గ్రామాలు, మండలాల వారీగా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

* ఎంపికైన లబ్ధిదారులకు ప్రతినెలా 15న ఏక మొత్తంలో రూ.లక్ష ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తారు.

* ఏ వస్తువులు, పరికరాలు కొనాలనేది లబ్ధిదారుల ఇష్టమే.

* ఆర్థిక సాయం పొందిన లబ్ధిదారులు నెల రోజుల్లోపు తమ వృత్తిని ప్రారంభించాలి. అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు జిల్లా కలెక్టర్‌ ఒక ప్రత్యేకాధికారిని నియమించాలి. లబ్ధిదారుడు ప్రారంభించిన వృత్తికి సంబంధించిన ఫొటోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని