రేషన్‌ డీలర్ల సమ్మె విరమణ

రేషన్‌ డీలర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ నిర్వహించిన చర్చలు ఫలించడంతో వారు సమ్మె విరమించారు.

Published : 07 Jun 2023 04:44 IST

ఐక్యవేదికతో మంత్రి గంగుల చర్చలు సఫలం
నేటి నుంచి తెరుచుకోనున్న దుకాణాలు

ఈనాడు, హైదరాబాద్‌: రేషన్‌ డీలర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ నిర్వహించిన చర్చలు ఫలించడంతో వారు సమ్మె విరమించారు. బుధవారం నుంచి రేషన్‌ దుకాణాలు యథావిధిగా తెరుచుకోనున్నాయి. డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు దిగిన తెలంగాణ రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘాల ఐక్యవేదికతో మంత్రి గంగుల సచివాలయంలో మంగళవారం చర్చలు జరిపారు. గౌరవ వేతనం సహా 12 డిమాండ్లను జూన్‌ 4వ తేదీలోపు పరిష్కరించాలంటూ రేషన్‌ డీలర్లు గత నెలలో నోటీసు ఇచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చలేదంటూ సోమవారం రేషన్‌ దుకాణాలను తెరవలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన చర్చల్లో మంత్రి గంగుల మాట్లాడుతూ.. రేషన్‌ డీలర్ల సంక్షేమం విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ‘‘2.83 కోట్ల మంది రేషన్‌ కార్డుదారుల ప్రయోజనాల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన అంశం. ఏ ఒక్కరూ రేషన్‌ బియ్యం అందక ఆకలితో ఉండకూడదన్నది లక్ష్యం. దీనికి రేషన్‌ డీలర్లు సహకరించాలి’’ అని కోరారు. ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కమీషన్‌ పెంపు ప్రతిపాదనను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. దీంతో సమ్మె విరమించి రేషన్‌ పంపిణీని ప్రారంభిస్తామని డీలర్ల ఐకాస ఛైర్మన్‌ నాయికోటి రాజు, ఇతర నేతలు మంత్రి సమక్షంలో ప్రకటించారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌, చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌ బాలమాయాదేవి, జాయింట్‌ కమిషనర్‌ ఉషారాణి, రేషన్‌ డీలర్ల ఐకాస నేతలు పాల్గొన్నారు. అంతకుముందు రేషన్‌ డీలర్ల సమ్మెకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, తెజస అధ్యక్షుడు కోదండరాం, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ మద్దతు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని