ఆధారాలు దొరికితే వీసీపై సస్పెన్షన్‌ వేటు?

నిబంధనలను ఉల్లంఘించి పొరుగు సేవల సిబ్బంది నియామకాలు, ఇతర అవకతవకలపై రుజువులు దొరికితే తెలంగాణ విశ్వవిద్యాలయం(టీయూ) ఉపకులపతి ఆచార్య రవీందర్‌ను సస్పెండ్‌ చేయాలని సర్కార్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated : 07 Jun 2023 04:55 IST

టీయూలో విజిలెన్స్‌ దాడుల నేపథ్యంలో చర్చ
ఉమ్మడి ఏపీలో 2010లో ఎస్‌కేయూ వీసీ కుసుమకుమారి సస్పెన్షన్‌

ఈనాడు, హైదరాబాద్‌: నిబంధనలను ఉల్లంఘించి పొరుగు సేవల సిబ్బంది నియామకాలు, ఇతర అవకతవకలపై రుజువులు దొరికితే తెలంగాణ విశ్వవిద్యాలయం(టీయూ) ఉపకులపతి ఆచార్య రవీందర్‌ను సస్పెండ్‌ చేయాలని సర్కార్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయకపోవడం... తెలంగాణ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం తీసుకున్న నిర్ణయాలపైనే హైకోర్టును ఆశ్రయించడం... స్వయంగా విద్యాశాఖ కార్యదర్శి పిలిచి నచ్చజెప్పినా మరుసటి రోజే ఓయూ ఆచార్యురాలు నిర్మలాదేవిని రిజిస్ట్రార్‌గా నియమించడం... నిత్యం రిజిస్ట్రార్లను నియమిస్తూ వర్సిటీని వివాదాల కేంద్రంగా మార్చారన్న భావనతో ఉన్న ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తాజా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడిని బట్టి స్పష్టమవుతోంది.  మొత్తానికి విజిలెన్స్‌ దాడుల్లో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు దొరికితే వారిచ్చే నివేదిక ఆధారంగా ఉపకులపతిని సస్పెండ్‌ చేయాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. అప్పుడు మరొక ఆచార్యుడిని లేదా ఐఏఎస్‌ అధికారిని ఇన్‌ఛార్జి వీసీగా నియమించి వచ్చే మే నెల వరకు కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పటికి వీసీ రవీందర్‌ పదవీ కాలం ముగుస్తుందని, అప్పుడు అన్ని వర్సిటీలతోపాటు ఆ విశ్వవిద్యాలయానికి కొత్త వీసీని నియమిస్తారని చెబుతున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విశ్వవిద్యాలయాల్లో విజిలెన్స్‌ దాడి జరగడం ఇదే మొదటిసారి.

ఉమ్మడి ఏపీలో తొలిసారి సస్పెన్షన్‌...

ఉమ్మడి ఏపీలో 2010 ఆగస్టులో అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వీసీగా ఉన్న పి.కుసుమ కుమారిని అప్పటి ప్రభుత్వం సస్పెండ్‌ చేయడానికి కొందరు అధికారులు గుర్తుచేస్తున్నారు. పద్మావతి మహిళా వర్సిటీలో ఆచార్యురాలైన ఆమె 2008లో వీసీగా నియమితులయ్యారు. సహాయ ఆచార్యులు 29 మందిని నియమించడంలో నియమ నిబంధనలు ఉల్లంఘించారని, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ హనుమంతు కమిషన్‌ నివేదిక ఆధారంగా సర్కారు సస్పెండ్‌ చేసింది. తర్వాత ఆమె హైకోర్టును ఆశ్రయించి పదవి చేపట్టినా తర్వాత జరిగిన పరిణామాల్లో అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ ఆమెను పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని