నెలాఖరులో హైదరాబాద్‌కు ప్రధాని!

రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భాజపా కార్యక్రమాలను వేగవంతం చేసింది. పార్టీ అగ్రనేతలు రాష్ట్రానికి వరుస కట్టనున్నారు.  మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా అగ్రనేతలు ఈ నెలలో రాష్ట్రానికి రానున్నారు.

Updated : 07 Jun 2023 04:57 IST

‘మల్కాజిగిరి’లో రోడ్‌షో, బహిరంగ సభలో పాల్గొనే అవకాశం
15న అమిత్‌షా.. 25న నడ్డా పర్యటనలు
రాష్ట్రానికి వరుస కట్టనున్న భాజపా అగ్రనేతలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భాజపా కార్యక్రమాలను వేగవంతం చేసింది. పార్టీ అగ్రనేతలు రాష్ట్రానికి వరుస కట్టనున్నారు. మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా అగ్రనేతలు ఈ నెలలో రాష్ట్రానికి రానున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈ నెల 15న ఖమ్మం బహిరంగసభలో పాల్గొననున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా 25న నాగర్‌కర్నూల్‌లో నిర్వహించే సభకు హాజరుకానున్నారు. ఈ నెలాఖరులో ప్రధాని హైదరాబాద్‌కు రానున్నారని భాజపా వర్గాలు తెలిపాయి. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో రోడ్‌షోతో పాటు భారీ సభలో మోదీ పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. అమిత్‌షా, నడ్డా కార్యక్రమాలు ఖరారు కాగా.. ప్రధాని పర్యటనపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలా కార్యకర్తలు, నాయకుల్లో మరింత జోష్‌ నింపేలా వరుస కార్యక్రమాలకు పార్టీ నాయకులు శ్రీకారం చుడుతున్నారు. దీంతో తటస్థంగా ఉన్న నాయకులు, ఇతర పార్టీల నేతల చేరికలపై కూడా స్పష్టత వస్తుందని వారు భావిస్తున్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలు, అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ నెలాఖరు వరకు భాజపా మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ను నిర్వహిస్తోంది. ఇందులో ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో అగ్రనేతలు ముగ్గురు రాష్ట్రంలో పర్యటించడం పార్టీకి ఊపునిస్తుందని రాష్ట్ర నాయకులు ఆశిస్తున్నారు. ఈ పర్యటనలపై భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ బన్సల్‌ పార్టీ నేతలతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు.

డెవలప్‌మెంట్‌ ఛార్జీల పేరుతో రూ. కోట్ల భారం: కొండా

రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని చెబుతూ.. ఇంటి కరెంట్‌కు డెవలప్‌మెంట్‌ ఛార్జీలు, సర్‌ఛార్జీల పేరుతో ప్రభుత్వం ప్రజల నుంచి రూ. కోట్లలో వసూలు చేస్తోందని భాజపా నాయకుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో డిస్కంలు రూ.45 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయన్నారు. ప్రగతిభవన్‌ విద్యుత్‌ బిల్లు ఎంతవుతోంది? దాన్ని చెల్లిస్తున్నారో లేదో చెప్పాలన్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ వినియోగించుకోకున్నా ఏడాదికి రూ. 400 కోట్లు చెల్లిస్తున్నారని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని