ఆవిష్కరణలకు ‘బిల్డ్‌’

ఆలోచనలు చాలామందికి ఉంటాయి.. వాటిని ఆచరణలోకి తేవాలన్నా.. ఆవిష్కరణలు సాధ్యం కావాలన్నా సరైన తోడ్పాటు కీలకం. ఈ అంశాల్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులను ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు ఐఐటీ హైదరాబాద్‌ గ్రీన్‌కో గ్రూప్‌తో కలిసి కొత్త ప్రోగ్రాంతో ముందుకొచ్చింది.

Updated : 07 Jun 2023 04:25 IST

12 నెలల ప్రోగ్రాంతో ముందుకొచ్చిన ఐఐటీ హైదరాబాద్‌
దేశవ్యాప్తంగా ఈసారి 75 మందికి అవకాశం

ఈనాడు, సంగారెడ్డి: ఆలోచనలు చాలామందికి ఉంటాయి.. వాటిని ఆచరణలోకి తేవాలన్నా.. ఆవిష్కరణలు సాధ్యం కావాలన్నా సరైన తోడ్పాటు కీలకం. ఈ అంశాల్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులను ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు ఐఐటీ హైదరాబాద్‌ గ్రీన్‌కో గ్రూప్‌తో కలిసి కొత్త ప్రోగ్రాంతో ముందుకొచ్చింది. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ఆచార్య బీఎస్‌మూర్తి, గ్రీన్‌కో గ్రూప్‌ ఎండీ డాక్టర్‌ అనిల్‌ చలమలశెట్టి ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు. దీనికి బోల్డ్‌, యునిక్‌ ఐడియాస్‌ లీడింగ్‌ టు డెవలప్‌మెంట్‌(బిల్డ్‌)గా నామకరణం చేశారు. దీని కాల వ్యవధి 12 నెలలు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ చదువుతున్న లేదా ఇటీవలే పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దేశవ్యాప్తంగా ఈసారి 75 మందికి అవకాశం కల్పించనున్నారు. ఎంపికైన వారికి రూ.లక్ష వరకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తారు. ఈ నిధులను గ్రీన్‌కో సంస్థ సమకూర్చనుంది. ఐఐటీ హైదరాబాద్‌లోని టెక్నాలజీ ఇంక్యుబేషన్‌ కేంద్రం విద్యార్థులకు అవసరమైన ఇతరత్రా సహకారాలు అందించనుంది. నిపుణుల మార్గదర్శనం, నమూనాల అభివృద్ధికి సహకారంతోపాటు 12 నెలల ప్రోగ్రాం తర్వాత కూడా అండగా నిలువనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మరో 14 ఇంక్యుబేషన్‌ కేంద్రాలూ ఇందులో పాలుపంచుకోనున్నాయి. ‘మూడేళ్లుగా బిల్డ్‌ ప్రోగ్రాంను మా విద్యార్థులకు అమలు చేస్తున్నాం. టెక్నాలజీ ఇన్నోవేషన్‌ పార్కు ప్రారంభించిన తర్వాత 1.5 లక్షల చదరపు మీటర్ల స్థలం అందుబాటులోకి రావడంతో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల కోసం ఉపయోగించాలనుకున్నాం. విద్యార్థులు ఉద్యోగులు కాకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలన్నదే మా లక్ష్యం’ అని ఆచార్య బీఎస్‌మూర్తి తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు https://itic.iith.ac.in/build  లింక్‌ ద్వారా జులై 5లోగా దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని