ప్రపంచంలో అయిదో ఆర్థికశక్తిగా భారత్‌

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనా దక్షతతో భారత్‌ అత్యంత బలమైన ఆర్థికశక్తిగా ఎదిగి, ప్రపంచంలో 5వ స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 07 Jun 2023 03:35 IST

మోదీ నిర్ణయాలతో దేశం అభివృద్ధి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

ఆమనగల్లు, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనా దక్షతతో భారత్‌ అత్యంత బలమైన ఆర్థికశక్తిగా ఎదిగి, ప్రపంచంలో 5వ స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో నూతనంగా నిర్మించిన భాజపా కార్యాలయ భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ అభ్యున్నతి, పేదరిక నిర్మూలనకు అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుని, చరిత్రాత్మక సంస్కరణలు అమలు చేసిన ఘనత మోదీకే దక్కిందన్నారు.  ఆర్టికల్‌ 370, ట్రిపుల్‌ తలాక్‌చట్టం రద్దు వంటి నిర్ణయాలను గుర్తుచేశారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం 9 ఏళ్లలో సాధించిన ప్రగతి, చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికి దేశవ్యాప్తంగా ‘మహాజన సంపర్క్‌ అభియాన్‌’ చేపడుతున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌- శ్రీశైలం జాతీయ రహదారి అభివృద్ధికి రూ.1750 కోట్లు 

హైదరాబాద్‌- శ్రీశైలం జాతీయ రహదారిని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ నుంచి నాగర్‌కర్నూల్‌ జిల్లా హాజీపూర్‌ వరకు నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం రూ.1750 కోట్లు మంజూరు చేసిందని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం నియంత పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. వారు దోచుకోగా మిగిలిన కొద్దిపాటి ప్రజాధనం మాత్రమే ప్రజలకు దక్కుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, భాజపా జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం భాజపా ఇన్‌ఛార్జి అందెల శ్రీరాములుయాదవ్‌, పురపాలిక ఛైర్మన్‌ రాంపాల్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని