ప్రధాని రాష్ట్రంలోనే 24 గంటల విద్యుత్తు లేదు: మంత్రి తలసాని

ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా కావడంలేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

Published : 07 Jun 2023 03:35 IST

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా కావడంలేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మంగళవారం హైదరాబాద్‌ వీఎస్టీ ఫంక్షన్‌ హాలులో పరిశ్రమలు, వాణిజ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో ఆయన మాట్లాడారు. భారాస ప్రభుత్వం టీఎస్‌ఐపాస్‌ విధానం అమల్లోకి తెచ్చిందన్నారు. పరిశ్రమల నిర్వాహకులకు రాయితీలు, నీటి వసతి, అనుమతులు, వసతులు సమకూర్చడంతో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయన్నారు. ఇప్పటికే గూగుల్‌, ఆపిల్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టాయన్నారు. సీఎం కేసీఆర్‌కు గొప్ప విజన్‌ ఉండడం వల్లనే రాష్ట్రంలో పారిశ్రామికరంగం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. 2014కు ముందు మూతపడ్డ పరిశ్రమలతో ఉపాధి లేక ఇబ్బందులు పడ్డారన్నారు. వాటిని తెలంగాణ సర్కార్‌ అధిగమించిందని పేర్కొన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటనకు వెళ్లి రూ.46 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారన్నారు. ఉత్తమ ప్రతిభ చాటిన పారిశ్రామికవేత్తలకు ఈ సందర్భంగా మంత్రి జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, ఆర్డీవో  వసంతకుమారి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రమేశ్‌, వీఎస్టీ కార్మిక సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌రెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని