మానవ అక్రమ రవాణా నిరోధంలో తెలంగాణ ప్రథమం

ప్రపంచంలో మూడో అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మారిన మానవ అక్రమ రవాణా సమాజానికి పెనుముప్పుగా పరిణమించిందని డీజీపీ అంజనీకుమార్‌ పేర్కొన్నారు.

Published : 07 Jun 2023 03:35 IST

డీజీపీ అంజనీకుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచంలో మూడో అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మారిన మానవ అక్రమ రవాణా సమాజానికి పెనుముప్పుగా పరిణమించిందని డీజీపీ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్‌ శాఖ కట్టుదిట్టమైన చర్యలతో దీన్ని నియంత్రిస్తోందని.. ఇందులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభాగం, బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ స్వచ్ఛంద సంస్థతో కలిసి తెలంగాణ పోలీస్‌ అకాడమీలో మంగళవారం రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మానవ, పిల్లల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్‌ శాఖతోపాటు స్వచ్ఛంద సంస్థలు కలసికట్టుగా పనిచేయాలని కోరారు. అన్ని జిల్లాల్లో మానవ అక్రమ రవాణా నిరోధక బృందాలు పనిచేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ శిఖా గోయల్‌ పేర్కొన్నారు. గత రెండేళ్లలో 738 కేసులు నమోదు చేసి.. 1,961 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.  అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేయడానికి ప్రొఫెషనల్‌ డేటా మేనేజ్‌మెంట్‌ ద్వారా ప్రత్యేక మెకానిజంను అభివృద్ధి చేసే ప్రక్రియలో మహిళా భద్రతా విభాగం ఉందని తెలిపారు. మానవ అక్రమ రవాణా నిరోధానికి చట్టంలోని నిబంధనల గురించి తెలంగాణ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య వివరించారు. అవయవాల వ్యాపారంలో వస్తున్న కొత్త పోకడల గురించి, బాధితులను రక్షించే పద్ధతుల గురించి సీఐడీ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌ ప్రసంగించారు. సదస్సులో ఎన్డీఆర్‌ఎఫ్‌ విశ్రాంత డీజీ డా.పీఎం నాయర్‌, మహిళా భద్రతా విభాగం ఎస్పీ పీవీ పద్మజ, అదనపు ఎస్పీ అశోక్‌ తదితరులు మాట్లాడారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని