కందులు, మినుములకు మంచి రోజులు

వానాకాలం ప్రారంభానికి ముందే కందులు, మినుములపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు మేలు కలగనుంది.

Updated : 07 Jun 2023 05:10 IST

సేకరణపై పరిమితి ఎత్తివేసిన కేంద్రం
తెలంగాణలో పెరగనున్న వీటి సాగు

ఈనాడు, హైదరాబాద్‌: వానాకాలం ప్రారంభానికి ముందే కందులు, మినుములపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు మేలు కలగనుంది. ఈ పంటల దిగుబడులపై సేకరణ పరిమితి(సీలింగు)ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో తెలంగాణలో వీటి సాగు విస్తీర్ణం మరింత పెరగనుంది. ఇప్పటివరకు పంట విస్తీర్ణంలో 40% వరకే మద్దతు ధరతో సేకరణ (ప్రొక్యూర్‌మెంట్‌) జరపాలని ఆంక్షలుండగా... వాటిని తొలగిస్తూ కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది. ఏటా ఇతర పంటలతోపాటు కందులు, మినుములకు కేంద్రం మద్దతు ధరలను ప్రకటిస్తుంది. ఈ మేరకు రాష్ట్రాల్లో ఆయా పంటల సాగు విస్తీర్ణం తెలుసుకొని, సేకరణ లక్ష్యాలను నిర్దేశిస్తుంది. నిరుడు కందులు, మినుములకు క్వింటాకు రూ.6600 మద్దతు ధర ప్రకటించింది. ఈ ధరలతో మొత్తం ఉత్పత్తిలో 40% మేరకు మాత్రమే కొనుగోలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. తెలంగాణలో 2022-23లో వానాకాలం, యాసంగికి కలిపి ఏడు లక్షల ఎకరాల్లో కందులు, 2.10 లక్షల ఎకరాల్లో మినుములు సాగవుతున్నాయి. కందులు ఉమ్మడి వరంగల్‌, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అధికంగా సాగవుతున్నాయి. మినుముల సాగు మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లలో ఎక్కువగా ఉంది. కేంద్రం విధించిన 40% కొనుగోలు లక్ష్యంతో నిరుడు రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లను ప్రారంభించింది. అయితే ఈ సీజన్‌లో మార్కెట్లలో కందులకు క్వింటాకు రూ.పది వేల మేరకు ధర పలికింది. మినుములకు రూ.7 వేలపైనే లభిస్తోంది. దీంతో ఈ రెండు ఉత్పత్తులు మార్క్‌ఫెడ్‌ కేంద్రాలకు పెద్దగా రావడం లేదు. తాజాగా కేంద్ర నిర్ణయంతోపాటు రాష్ట్ర ప్రభుత్వమూ పంటల మార్పిడికి ప్రయత్నిస్తుండటంతో ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాల సాగు పెరిగే అవకాశముందని రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్గాలు భావిస్తున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని