కేంద్రం ‘మద్దతు’ అంతంతే!

పంట పండించే రైతుకు మిగిలేది కష్టం... నష్టం మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో రైతులు పండించే పంటలకు కేంద్ర ప్రకటించిన కొత్త మద్దతు ధరలను పరిశీలిస్తే రైతులకు మిగిలేదేమీ ఉండదని స్పష్టంగా తెలుస్తోంది.

Updated : 08 Jun 2023 05:33 IST

క్వింటా పత్తి సాగుకు పెట్టుబడి రూ.11 వేలు.. మద్దతు ధర రూ7,020
వరి సాధారణ ధాన్యం పండించాలంటే రూ.3,300.. మద్దతు రూ.2,183
జాతీయ స్థాయి సగటు లెక్కలతో రాష్ట్ర రైతులకు నష్టం

ఈనాడు, హైదరాబాద్‌: పంట పండించే రైతుకు మిగిలేది కష్టం... నష్టం మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో రైతులు పండించే పంటలకు కేంద్ర ప్రకటించిన కొత్త మద్దతు ధరలను పరిశీలిస్తే రైతులకు మిగిలేదేమీ ఉండదని స్పష్టంగా తెలుస్తోంది. రైతులు పంటల సాగుకు పెడుతున్న పెట్టుబడి ఖర్చులపై రాష్ట్ర వ్యవసాయశాఖ అధ్యయనం చేసి ‘భారత వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌’ (సీఏసీపీ)కి పంపింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో క్వింటా వరి సాధారణ రకం ధాన్యానికైతే రూ.3,300, ఏ గ్రేడ్‌ ధాన్యం పండించాలంటే రూ.3,400, పత్తికి రూ.11 వేలు, మక్కలకు రూ.2 వేలు, సోయా పంటకు రూ.4,500 రైతు గతేడాది పెట్టుబడి పెట్టారు. విత్తనాలు, యంత్రాలు, డీజిల్‌, కూలీ...ఇలా అన్ని రకాల ఖర్చులు ఈ ఏడాది ఇంకా పెరగనున్నాయి. అయినా పెట్టుబడి ఖర్చుల్లో కనీసం మూడొంతులైనా లేకుండా కొత్త మద్దతు ధరలు నిర్ణయించడం రైతులను నిరాశపరుస్తోంది. ఉదాహరణకు సాధారణం వరి ధాన్యం క్వింటా పండిస్తే రూ.3,300 ఖర్చవుతుంటే అంతకన్నా రూ.1,117 తగ్గించి మద్దతు ధర రూ.2,183 మాత్రమే ఇస్తే రైతుకేం మిగులుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. పత్తి పెట్టుబడి ఖర్చు రూ.11 వేలైతే అంతకన్నా రూ.3,980 తగ్గించి కొత్త మద్దతు ధరను ప్రకటించారు. ప్రతి పంట సాగుకు రైతు పెట్టే పెట్టుబడి ఖర్చును జాతీయ స్థాయిలో సగటు లెక్కగట్టి దానిపై 50 శాతం కలిపి ఇస్తున్నామని కేంద్రం చెబుతోంది. ఇది రాష్ట్ర రైతులకు తీవ్ర నష్టం కలగజేస్తోంది. ఉదాహరణకు తెలంగాణలో సాధారణ రకం వరి ధాన్యం క్వింటా పండించాలంటే రూ.3,300 దాకా రైతు పెట్టుబడి పెడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ సీఏసీపీకి సవివరంగా పంపింది.


ఖర్చులను కేంద్రం పట్టించుకోవడం లేదు

తెలంగాణలో సాగు ఖర్చులు బాగా పెరిగాయి. జాతీయ స్థాయి సగటు లెక్కలతో రాష్ట్ర రైతులకు నష్టం వస్తోంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఖర్చులున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు.   రాష్ట్రాలవారీగా సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకోకుండా జాతీయ సగటు ప్రకారం మద్దతు ధరలను కేంద్రం ప్రకటించడం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతోంది. సీఎం కేసీఆర్‌ సాగునీటిని అందుబాటులోకి తెచ్చి పంటల సాగు విస్తీర్ణం పెంచితే గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా రైతులను నష్టపరచడం కేంద్రానికి తగదు.

కె.రాములు, రాష్ట్ర వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని