ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదంతో అర్హుల ఎంపిక

రాష్ట్రంలో బీసీల్లోని చేతి కుల వృత్తుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదంతోనే అర్హులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 08 Jun 2023 04:59 IST

కుల వృత్తులకు ఆర్థిక సాయంపై ప్రభుత్వ నిర్ణయం
రోజుకు కనీసం 50 యూనిట్లు గ్రౌండ్‌ చేయాలి: కలెక్టర్లతో మంత్రి గంగుల

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీసీల్లోని చేతి కుల వృత్తుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదంతోనే అర్హులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోజుకి కనీసం 50 యూనిట్లు గ్రౌండింగ్‌ చేసే లక్ష్యంతో పనిచేయాలని కలెక్టర్లకు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సూచించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 9న సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రెండోవిడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. బుధవారమిక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కుల వృత్తిదారుల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా రూ.లక్ష గ్రాంటు అందించనున్నట్లు తెలిపారు. ‘‘ఆర్థికసహాయం కార్యక్రమాన్ని ఈనెల 9న సంక్షేమ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ మంచిర్యాలలో ప్రారంభించి, అర్హులకు చెక్కులను పంపిణీ చేస్తారు. అదేరోజు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అర్హులకు చెక్కులు అందించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఈ పథకం దుర్వినియోగానికి అవకాశాల్లేకుండా అప్రమత్తంగా ఉండాలి. కులవృత్తులకు ఆర్థిక సహాయం నిరంతర కార్యక్రమం.. ఈ పథకం కింద ప్రతినెలా ఎంపికచేసిన అర్హులకు స్థానిక ఎమ్మెల్యేలు 15న చెక్కులు పంపిణీ చేస్తారు. ఆర్థిక సహాయం దరఖాస్తులు ఆన్‌లైన్లో స్వీకరిస్తాం. కులవృత్తులకు దోహదపడే పరికరాల కొనుగోలు కోసం లబ్ధిదారులకు సహకరించడంతో పాటు ఆయా వివరాలు ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేస్తాం. రెండేళ్ల వరకు పర్యవేక్షిస్తూ అర్హులు ఆర్థికంగా ఉన్నతస్థితి సాధించడంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుంది’’ అని మంత్రి గంగుల తెలిపారు. నిరుపేద చేతివృత్తిదారులను గుర్తించి వారికి ఆర్థిక చేయూతనిచ్చేలా కలెక్టర్లు దృష్టిపెట్టాలని సంగారెడ్డి నుంచి కాన్ఫరెన్సుకు హాజరైన మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలన్నారు.

వైద్య నిపుణులకు మెరిట్‌ సర్టిఫికెట్లు

రాష్ట్రంలో ఆరోగ్య దినోత్సవంలో భాగంగా ఈనెల 14న నియోజకవర్గంలో 15 మంది గర్భిణులకు కేసీఆర్‌ పౌష్టికాహార కిట్లు అందజేయాలని సమీక్షా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు కలెక్టర్లకు సూచించారు. ఐదు కేటగిరీల కింద మెరిట్‌ సర్టిఫికెట్లను 14న వైద్య నిపుణులకు పంపిణీ చేస్తామని, ఈ అవార్డులకు అర్హులైన వారిని గుర్తించాలని వారికి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని