నీటి వనరులకు నీరాజనం

‘ఒకప్పుడు చుక్కనీటి కోసం అల్లాడిన నేలకు ఇప్పుడు ప్రతినిత్యం జలాభిషేకం’ అంటూ సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన విజయాలను గుర్తుచేసుకున్నారు రాష్ట్రంలో మంత్రులు, అధికారులు, రైతులు.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించారు.

Published : 08 Jun 2023 04:59 IST

అట్టహాసంగా సాగునీటి దినోత్సవం
వివిధ ప్రాజెక్టుల వద్ద పాల్గొన్న ప్రజాప్రతినిధులు

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఒకప్పుడు చుక్కనీటి కోసం అల్లాడిన నేలకు ఇప్పుడు ప్రతినిత్యం జలాభిషేకం’ అంటూ సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన విజయాలను గుర్తుచేసుకున్నారు రాష్ట్రంలో మంత్రులు, అధికారులు, రైతులు.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించారు. అన్ని ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల వద్ద సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు ఏర్పాటు చేసి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు వేడుకలు నిర్వహించారు. నీటిపారుదలశాఖ ప్రధాన కార్యాలయంలో మహిళా ఇంజినీర్లు, ఉద్యోగినులు బతుకమ్మ ఆడారు. కాళేశ్వరం, దేవాదుల, శ్రీరామసాగర్‌, శ్రీరామసాగర్‌ రెండోదశ, వరదకాలువ, ఎల్లంపల్లి, సీతారామ ఎత్తిపోతల, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఇలా అన్ని ప్రాజెక్టుల వద్ద పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎత్తిపోతల పథకం పూర్తయితే సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలమవుతుందని తెలిపారు. సంగమేశ్వర పథకానికి భూములిచ్చిన రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.

* నిజామాబాద్‌ జిల్లాలోని సిద్దాపూర్‌ రిజర్వాయర్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్‌ నాయకులు నీళ్లు లేని చోట కాలువలు తవ్వి కాంట్రాక్టర్ల జేబులు నింపారని, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్లలోనే నిర్మించి సీఎం కేసీఆర్‌ చరిత్ర సృష్టించారని అన్నారు. ఎస్సారెస్పీ రివర్స్‌ పంపింగ్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. గోదావరిలో వృథాగా పోతున్న నీటిని కాళేశ్వరం వద్ద ఒడిసిపట్టి అక్కడి నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా వరద కాలువ మీదుగా ఎస్సారెస్పీ ప్రాజెక్టును నింపుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా.. ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేసి పథకానికి సంబంధించిన అంశాలను రైతులకు మంత్రి వివరించారు. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. ఏ గ్రామంలో చూసినా చెరువుల్లో నిండు కుండల్లా నీళ్లుండడం అద్భుతమన్నారు.

* వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్ని వాగులపై నిర్మించిన చెక్‌డ్యాములు రైతులకు అక్కరకొచ్చాయని తెలిపారు. 35 ఏళ్ల తర్వాత కృష్ణమ్మ నీళ్లతో గణపసముద్రం అలుగు పారిందని, 24 కిలోమీటర్ల కాలువ 11 నెలల్లో పూర్తి చేశామని తెలిపారు. కీసర మండలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. సాగు, తాగునీటి గోసను తీర్చిన కేసీఆర్‌ వెంట ప్రజలు నిలబడాలని కోరారు. నిజామాబాద్‌లో జరిగిన సాగునీటి దినోత్సవంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. కేసీఆర్‌ అంటే కాలువలు, చెక్‌డ్యాములు రిజర్వాయర్లని అభివర్ణించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కాదు.. కాళేశ్వర చంద్రశేఖర్‌ రావని, దేశానికే గర్వకారణమైన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరారు.


యావత్‌ ప్రపంచానికి ఆదర్శం: కేటీఆర్‌

తెలంగాణ జల విధానం యావత్‌ ప్రపంచానికే ఆదర్శమని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో ఉంటే.. నేడు సాగునీటి రంగంలో స్వర్ణయుగమని, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి అంటే, కేసీఆర్‌ తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేశారన్నారు.


ఇది తెలంగాణ జలవిజయం: హరీశ్‌రావు

నాడు ఎటు చూసినా తడారిన నేలలు దర్శనమిస్తే, నేడు ఎటు చూసినా గోదావరి పరవళ్లు తొక్కుతోందని మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇది సీఎం కేసీఆర్‌ సాధించిన ఘన విజయమన్నారు.


రికార్డు స్థాయిలో జనహారతి

సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘కాళేశ్వరం జలాలకు లక్ష జనహారతి’ పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చివ్వెంల మండల కేంద్రం వద్ద ఆయన కాళేశ్వరం జలాలకు హారతులు పట్టి.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేవలం ఆరువేల క్యూసెక్కుల నీటిని 350 కి.మీ. దూరం పారించడం అసాధ్యమని, మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించడమే సరైనదని ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్‌.. అధికారంలోకి రాగానే దాన్ని సాకారం చేసి చూపారని జగదీశ్‌రెడ్డి అన్నారు. ఎస్సారెస్పీ స్టేజ్‌ -2 కాల్వ పొడవునా రైతులు, మహిళలు బోనాలు, బతుకమ్మలతో వెళ్లి.. కాళేశ్వర జలాలకు పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి వండర్‌ వరల్డ్‌బుక్‌ రికార్డ్స్‌లో చోటు దక్కినట్లు నిర్వాహకులు వెల్లడించారు. 126 పంచాయతీల పరిధిలో మొత్తం 107 కెమెరాలు, ఎనిమిది డ్రోన్లు పెట్టి చిత్రీకరించామని.. మొత్తం 68 కి.మీ. పరిధిలో 1,16,142 మంది ప్రజలు పాల్గొన్నట్లు వెల్లడించారు. అవార్డును మంత్రి జగదీశ్‌రెడ్డి, జిల్లా కలెక్టరు వెంకటరావుకు అందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని