పోలీసు నియామక ప్రక్రియ వేగవంతం

ఎస్సై, కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వేగవంతం చేసింది.

Updated : 08 Jun 2023 05:40 IST

14 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన
రాష్ట్రవ్యాప్తంగా 18 కేంద్రాల ఏర్పాటు
అదనపు ఎస్పీ స్థాయి అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సై, కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వేగవంతం చేసింది. తుది రాత పరీక్షల ఫలితాలను ఇటీవల వెల్లడించిన మండలి.. ఆ తర్వాతి దశపై దృష్టి సారించింది. రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను ఈ నెల 14 నుంచి 26వ తేదీ వరకు పరిశీలించాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి కేంద్రానికి అదనపు ఎస్పీ/అదనపు డీసీపీ స్థాయి అధికారిని పర్యవేక్షకుడిగా నియమించింది. ఆ హోదా అధికారి అందుబాటులో లేనిపక్షంలో సంబంధింత యూనిట్‌ ఎస్పీ ఆ ప్రక్రియ చూసుకోవాలని సూచించింది.

తుదిఎంపికలో కటాఫ్‌ మార్కులే కీలకం

ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం తుదిఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. తుదిఎంపికకు కీలకమైన కటాఫ్‌ మార్కులను నిర్ణయించనున్నారు. ఇందుకోసం జిల్లా, కంటీజియస్‌ డిస్ట్రిక్ట్‌(పొరుగునే ఉండే జిల్లా), జోనల్‌, మల్టీజోనల్‌ స్థాయుల్లోని ఖాళీలను పరిగణనలోకి తీసుకోనున్నారు. తుది రాత పరీక్ష ఫలితాల అనంతరం 1,50,852 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో ఒకటికంటే ఎక్కువ పరీక్షల్లో అర్హత సాధించినవారు ఉండటంతో వాస్తవ అర్హుల సంఖ్య సుమారు 1.09 లక్షల మంది ఉన్నట్లు తేలింది. ఈ లెక్కన మొత్తం 17,516 పోస్టుల కోసం సగటున ఆరుగురు చొప్పున పోటీపడుతున్నట్లు వెల్లడైంది.
పరిశీలన కేంద్రాలు: హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, సిద్దిపేట, రామగుండం, ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌

సమర్పించాల్సిన ధ్రువీకరణపత్రాలు

* సామాజిక ధ్రువీకరణ పత్రం (2014 జూన్‌ 2 లేదా ఆ తర్వాతి తేదీతో ఉండాలి)
* బీసీ అభ్యర్థులకు నాన్‌ క్రీమీలేయర్‌ ధ్రువీకరణ పత్రం (2021 ఏప్రిల్‌ 1 లేదా ఆ తర్వాతి తేదీతో..)
* ఆర్థికంగా వెనకబడిన తరగతుల ధ్రువీకరణ పత్రం (2021 ఏప్రిల్‌ 1 లేదా ఆ తర్వాతి తేదీతో..)

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు