సుప్రీం ఆదేశాలనూ అమలు చేయరా?

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఖానాపూర్‌లో 20 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో నుంచి తొలగించి ఈ-పట్టాదారు పాస్‌బుక్‌ జారీ చేయాలంటూ 2019లో హైకోర్టు, 2021లో సుప్రీంకోర్టు ఆదేశించినా అమలు చేయని అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated : 08 Jun 2023 05:34 IST

ఈ-పట్టాదారు పాస్‌బుక్‌లతో హాజరుకండి
రంగారెడ్డి కలెక్టర్‌, జేసీ, ఆర్డీవోలకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఖానాపూర్‌లో 20 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో నుంచి తొలగించి ఈ-పట్టాదారు పాస్‌బుక్‌ జారీ చేయాలంటూ 2019లో హైకోర్టు, 2021లో సుప్రీంకోర్టు ఆదేశించినా అమలు చేయని అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ-పట్టాదారు పాస్‌బుక్‌లతో ఈనెల 20న హాజరుకావాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.హరీశ్‌, రాజేంద్రనగర్‌ ఆర్డీవో కె.చంద్రకళ, గండిపేట తహసీల్దార్‌ ఎ.రాజశేఖర్‌లను ఆదేశించింది. ఈ ఉత్తర్వుల అమలులో మరోసారి విఫలమైతే చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించింది. గండిపేటలోని 20 ఎకరాల భూమికి పట్టాదారు పాస్‌బుక్‌లు అందజేయాలన్న కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో ప్రతాప్‌ ఎంటర్‌ప్రైజెస్‌ గ్రూప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మరో ముగ్గురు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గండిపేటలోని 20 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చగా పిటిషనర్లు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేయాలని సింగిల్‌ జడ్జి, హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా హక్కులపై సివిల్‌ కోర్టు వెలువరించే తీర్పునకు కట్టుబడి ఉంటుందని పేర్కొంటూ ఈ-పాస్‌బుక్‌ జారీ చేయాలని 2021లో ఆదేశాలు జారీ చేసింది.

అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైంది. ఈ ఏడాది మార్చి 24న ఇది విచారణకు రాగా షరతులతో పాస్‌బుక్‌ ఇవ్వడానికి ధరణిలో అవకాశం లేదని, నాలుగు వారాల గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. తిరిగి ఏప్రిల్‌ 24న విచారణకు రాగా పాస్‌బుక్‌ అందజేసినట్లు చెప్పారు. దీన్ని ధ్రువీకరణ నిమిత్తం వాయిదా వేశారు. అయితే ఇప్పటివరకు పాస్‌బుక్‌ ఇవ్వలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా ధరణిలో అప్‌లోడ్‌ చేశామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీనిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పాస్‌బుక్‌ను పిటిషనర్లకు అందజేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించినా ధరణిలో అప్‌లోడ్‌ చేశామనడం సరికాదంది. కోర్టులు ఆదేశించినా ఫలితం లేకపోవడంతో సామాన్యుడు న్యాయం కోసం ఎక్కడికెళ్లాలని ప్రశ్నించింది. ఈనెల 20న పాస్‌బుక్‌తో కలెక్టర్‌, అధికారులు హాజరుకావాలని ఆదేశించింది. లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని