ఉద్యమ నాయకుడితోనే ప్రగతి

విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, సంక్షేమం.. ఇలా ప్రతి అంశంలోనూ తెలంగాణ శరవేగంగా అభివృద్ధి సాధించడానికి సీఎం కేసీఆర్‌ నాయకత్వమే కారణమని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 08 Jun 2023 04:11 IST

ఇతరుల చేతుల్లోకి వెళ్తే తెలంగాణ ఆగమవుతుంది
మంత్రి హరీశ్‌రావు
సంగమేశ్వర ఎత్తిపోతలకు భూమిపూజ

ఈనాడు, సంగారెడ్డి: విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, సంక్షేమం.. ఇలా ప్రతి అంశంలోనూ తెలంగాణ శరవేగంగా అభివృద్ధి సాధించడానికి సీఎం కేసీఆర్‌ నాయకత్వమే కారణమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉద్యమ నాయకుడి చేతిలో రాష్ట్రం ఉన్నందువల్లే ఇది సాధ్యమైందన్నారు. భవిష్యత్తులోనూ ఆయన నాయకత్వమే రాష్ట్రానికి మేలు చేస్తుందన్నారు. ఇతరుల చేతుల్లోకి వెళ్తే పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం ఆగమవుతుందని చెప్పారు. తెలంగాణ రాకపోతే.. కేసీఆర్‌ సీఎం కాకపోతే.. ఈ పనులేవీ జరిగేవి కావన్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మడలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులకు బుధవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. రూ.2,653 కోట్లతో చేపడుతున్న పథకాన్ని రెండేళ్లలో పూర్తిచేస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని అయిదు నియోజకవర్గాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందుతుందని తెలిపారు. అభివృద్ధి పనులను కొనసాగించడానికి ప్రజలంతా కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరిచి భారాసను మరోసారి ఆశీర్వదించాలని మంత్రి కోరారు. ప్రస్తుతం నల్లా ద్వారా పొయ్యి వద్దకే తాగునీరు వస్తున్నట్లు.. పొలాల వద్దకు సాగునీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ, కలెక్టర్‌ శరత్‌, ఎంపీ బీబీ పాటిల్‌, చేనేత అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్‌, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ మల్కాపురం శివకుమార్‌, నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ధరణి బాగుందన్న రైతులు

సంగమేశ్వర ఎత్తిపోతల పథకం భూమిపూజకు వెళ్లే క్రమంలో సదాశివపేట తహసీల్దారు కార్యాలయాన్ని మంత్రి హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న రైతులతో ముచ్చటించారు. ధరణి వచ్చిన తర్వాత ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. భూమిని ఇంట్లో వాళ్ల పేరుపై మార్చాలంటే గతంలో చాలా కష్టంగా ఉండేదని.. ఇప్పుడు చాలా సులభంగా పని పూర్తవుతోందని నిజాంపూర్‌ గ్రామానికి చెందిన సూర అనంతమ్మ తెలిపారు. ఒకప్పుడు భూమి అమ్మాలంటే రిజిస్ట్రేషన్‌ ఒకసారి, మ్యుటేషన్‌ మరోసారి చేసేవారని వెల్తూర్‌ గ్రామానికి చెందిన మ్యాతరి రాజయ్య తెలిపారు. ఇప్పుడు ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే అరగంటలోనే రెండూ పూర్తవుతుండటం బాగుందని చెప్పారు. ధరణితో తమకు మేలే జరిగిందని రైతులు తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని