విద్యుత్‌, సాగునీరు.. సేద్యానికి రెండు కళ్లు

వ్యవసాయానికి సాగునీరు, విద్యుత్తు రెండు కళ్లని, సీఎం కేసీఆర్‌ దార్శనికత, దృఢసంకల్పంతోనే ఆ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధ్యమైందని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

Published : 08 Jun 2023 04:11 IST

కేసీఆర్‌ దార్శనికతతోనే ఆ రంగాల్లో గణనీయ అభివృద్ధి
శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: వ్యవసాయానికి సాగునీరు, విద్యుత్తు రెండు కళ్లని, సీఎం కేసీఆర్‌ దార్శనికత, దృఢసంకల్పంతోనే ఆ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధ్యమైందని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ ఉత్సవాల్లో భాగంగా రవీంద్రభారతిలో బుధవారం రాత్రి సాగునీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గుత్తా మాట్లాడుతూ.. ‘ఆ రోజు కేసీఆర్‌కు మంత్రి పదవి ఇస్తే తెలంగాణ ఉద్యమం వచ్చేది కాదని, రాష్ట్రం విడిపోయేది కాదని కొందరు అంటుంటారు. కానీ వాస్తవానికి 1996లోనే.. ప్రత్యేక తెలంగాణ వస్తేనే ఈ ప్రాంతం బాగుపడుతుందని, దానికి తానే సారథ్యం వహిస్తానని కేసీఆర్‌ చెప్పేవారు’ అని గుత్తా గుర్తుచేసుకున్నారు. గత తొమ్మిదేళ్లలో సీఎం అనుకున్న లక్ష్యాన్ని సాధించారన్నారు. దేశంలో తలసరి విద్యుత్‌ వినియోగం 1200 యూనిట్లు ఉంటే, రాష్ట్రంలో 2200 యూనిట్లు ఉందన్నారు. ‘ముఖ్యమంత్రి ఎవరినీ కలవరని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయన 24 గంటలూ అభివృద్ధి, సంక్షేమం, ప్రజలకు ఇంకా ఏం చేయాలో అనే ఆలోచనలతో బిజీగా ఉంటారు’ అని తెలిపారు. ఈ సందర్భంగా సాగునీటికి సంబంధించి రచించిన ఆరు పుస్తకాలను గుత్తా ఆవిష్కరించారు. తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను సాగునీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ వివరించారు. నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ సముద్రాల వేణుగోపాలాచారి, నీటి వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌, ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ (జనరల్‌) సి.మురళీధర్‌, ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ (అడ్మిన్‌) జి.అనిల్‌కుమార్‌, ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌(ఓఅండ్‌ఎం, క్యూసీ) బి.నాగేందర్‌రావులు మాట్లాడారు. శ్రీధర్‌రావు దేశ్‌పాండే స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉత్తమ ఇంజినీర్‌ పురస్కారాలను పలువురికి అందజేశారు.


ప్రాజెక్టుల నిర్మాణంతో జలకళ: వినోద్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో ఎక్కడా కాళేశ్వరం తరహా ప్రాజెక్టు మరొకటి చూడలేమని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో చరిత్రాత్మకమైన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సాగు గణనీయంగా పెరిగి.. దండగ అన్న వ్యవసాయం పండగలా మారిందని పేర్కొన్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని