దిల్లీ మద్యం కేసులో.. అరుణ్‌ పిళ్లై బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసిన హైదరాబాద్‌ వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లై బెయిల్‌ పిటిషన్‌ను ఇక్కడి రౌస్‌ ఎవెన్యూ కోర్టు కొట్టివేసింది.

Published : 09 Jun 2023 03:20 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసిన హైదరాబాద్‌ వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లై బెయిల్‌ పిటిషన్‌ను ఇక్కడి రౌస్‌ ఎవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఈమేరకు సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.కె.నాగ్‌పాల్‌ గురువారం తీర్పును వెలువరించారు. ‘‘ఇంతవరకు చేపట్టిన దర్యాప్తులో వెలుగుచూసిన అంశాల ప్రకారం అరుణ్‌ పిళ్లై ఈ నేరపూరిత కుట్రలో కేవలం భాగస్వామి కావడమే కాకుండా.. నేరపూరిత ఆర్జనకు సంబంధించి సీబీఐ నమోదుచేసిన ప్రధాన కేసులో పేర్కొన్న కార్యకలాపాలతోనూ అతనికి సంబంధం ఉన్నట్లు ప్రాథమికంగా కనిపించింది. ఆ ఆర్జనను దాచిపెట్టడం, దగ్గర ఉంచుకోవడం, స్వాధీనం చేసుకోవడం, దానిద్వారా అక్రమమార్గంలో ఆస్తులు కొనడం లాంటి కార్యకలాపాల్లో అతను పాల్గొన్నట్లు తేలింది. వాటివెనుక ఉన్న ఉద్దేశాల గురించి పూర్తిగా తెలిసికూడా అందులో భాగస్వామి అయ్యారు. పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 3 కింద పేర్కొన్న మనీల్యాండరింగ్‌ నేరానికి అతను పాల్పడినట్లు ప్రాథమికంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు అతనికి వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థ సేకరించిన మౌఖిక, డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలను కోర్టు అభినందిస్తోంది. నిందితుడు మనీల్యాండరింగ్‌లో క్రియాశీలకపాత్ర పోషించినట్లు సాక్ష్యాధారాలు చూపడం ద్వారా దర్యాప్తు సంస్థ ఒక నిజమైన కేసును కోర్టు ముందు ఉంచినట్లయింది. అందువల్ల కోర్టు విరుద్ధమైన అభిప్రాయానికి రాలేకపోతోంది. అతని అరెస్టు చట్టవిరుద్ధం, అన్యాయం అన్న వాదనలతో ఏకీభవించలేకపోతోంది. పైగా ఈ కేసులో నిందితులుగా ఉన్న సమీర్‌ మహేంద్రు, విజయ్‌నాయర్‌, అభిషేక్‌ బోయిన్‌పల్లి, బినయ్‌బాబు, పి.శరత్‌చంద్రారెడ్డి, రాఘవ్‌ మాగుంట, మనీష్‌ సిసోదియా బెయిల్‌ అప్లికేషన్లను ఇదే కోర్టు ఇదివరకు డిస్మిస్‌ చేసింది. మనీల్యాండరింగ్‌లో అరుణ్‌పిళ్లై పాత్ర కొందరు సహ నిందితులకంటే తీవ్రంగా ఉంది. అందువల్ల అతని బెయిల్‌ దరఖాస్తును కొట్టేస్తున్నాం’’ అని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల్లో.. సౌత్‌లాబీ, ఇండోస్పిరిట్‌ సంస్థలో అరుణ్‌పిళ్లై కవిత ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించినట్లు కోర్టు పేర్కొంది. ఇండోస్పిరిట్‌ సంస్థలో అరుణ్‌పిళ్లై వాటా రూ.3.40 కోట్లే అయినప్పటికీ రూ.32.86 కోట్ల భారీ లాభం కూడగట్టుకున్నారని పేర్కొంది. ఆ రూ.3.40 కోట్లలో కోటి రూపాయలను కవిత ఆదేశాల మీద వి.శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఇచ్చినట్లు పేర్కొంది. దర్యాప్తు సమయంలో సాక్షిగా ఇచ్చిన వాంగ్మూలం ద్వారా అది వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. రూ.32.86 కోట్ల లాభంలో రూ.25.5 కోట్లను ఇండోస్పిరిట్‌ సంస్థ ఖాతా నుంచి నేరుగా అరుణ్‌పిళ్లై ఖాతాకు బదిలీ అయినట్లు పేర్కొంది. ఈ లాభాల్లో రూ.5 కోట్లను అతను కవిత కోసం ఆస్తులు కొనడానికి క్రియేటివ్‌ డెవలపర్స్‌కి బదిలీ చేసినట్లు పేర్కొంది. ఈ లావాదేవీలు కవిత ఆదేశాల మేరకే జరిగినట్లు క్రియేటివ్‌ డెవలపర్స్‌కి చెందిన వ్యక్తులు ఇచ్చిన సాక్ష్యం ద్వారా తెలిసిందని వెల్లడించింది. ఇండోస్పిరిట్‌ ద్వారా ఆర్జించిన నేరపూరిత లాభం నుంచి ఆయన కవిత బినామీగా ఈ లావాదేవీ నిర్వహించినట్లు కనిపిస్తోందని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.


రాఘవ్‌ బెయిల్‌పై స్టే ఇవ్వండి

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ

దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ్‌కు నానమ్మ అనారోగ్యం కారణంతో దిల్లీ హైకోర్టు 15 రోజుల మధ్యంతర బెయిల్‌ ఇవ్వడాన్ని ఈడీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. తక్షణం ఆ బెయిల్‌పై స్టే విధించాలని కోరింది. బుధవారం హైకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ గురించి అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు గురువారం జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ రాజేష్‌ బిందల్‌ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేశారు. మనీ ల్యాండరింగ్‌ కేసులో అరెస్టయిన వ్యక్తికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడం భావ్యం కాదని వాదించారు. నిందితుడి నానమ్మకు ముక్కుకు దెబ్బ తగిలిందన్న కారణంతో బెయిల్‌ ఇచ్చారని, అదేమీ తీవ్రమైన అనారోగ్యం కాదని పేర్కొన్నారు. ఈయన ఆమెకు మనుమడు మాత్రమేనని, ఆమెను చూసుకోవడానికి ఎంపీ అయిన తండ్రి, మరో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పైగా ఆమె ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉందని చెబుతున్నారని, అక్కడికి ఎవర్నీ పంపరు కాబట్టి పరామర్శించే అవకాశం కూడా ఉండదని, అందువల్ల బెయిల్‌ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే ఇందులో ప్రతివాదుల వాదనలు కూడా వినాల్సి ఉన్నందున శుక్రవారం వింటామని చెబుతూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని