వారిది ‘మామూలు’ యాత్రేనా!

రాష్ట్ర ఖజానాకు పెద్దమొత్తంలో ఆదాయం సమకూర్చే వాటిలో ఎక్సైజ్‌ శాఖ ఒకటి. అందులో కీలకమైన స్థానాల్లో ఉన్న నలుగురు ఉన్నతాధికారుల విదేశీ పర్యటన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Published : 09 Jun 2023 03:20 IST

చర్చనీయాంశంగా నలుగురు ఎక్సైజ్‌ ఉన్నతాధికారుల తీరు
విదేశీ పర్యటన వెనక సిండికేట్‌ పాత్ర!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఖజానాకు పెద్దమొత్తంలో ఆదాయం సమకూర్చే వాటిలో ఎక్సైజ్‌ శాఖ ఒకటి. అందులో కీలకమైన స్థానాల్లో ఉన్న నలుగురు ఉన్నతాధికారుల విదేశీ పర్యటన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న నలుగురికి ఒకేసారి సెలవులు మంజూరు కావడం గమనార్హం. శాఖాపరంగా ఆ అధికారులు పనిచేసే ప్రాంతమే ఆదాయార్జనలో అత్యంత కీలకం. ఏటా దాదాపు 25 శాతం ఆదాయం ఆ ప్రాంతం నుంచే సమకూరుతోంది. అలాంటి చోట పనిచేస్తున్న అధికారులు అందరికీ ఒకేసారి వారం రోజులకుపైగా సెలవులు మంజూరు కావడం.. ఆ నలుగురూ విదేశాల్లో ఒకే చోటుకు వెళ్లడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులైనా, ఉద్యోగులైనా తమకున్న ఆర్జిత సెలవులను వినియోగించుకునే హక్కు కలిగిఉన్నా నలుగురికి ఒకేసారి మంజూరైన తీరు విస్తుగొలుపుతోంది. ఒక బృందంగా ఏర్పడిన వీరి మాట ఆ శాఖలో చెల్లుబాటవుతుండటం.. సంబంధిత శాఖ పెద్దలకు వీరు సన్నిహితులుగా ముద్రపడటంతో సెలవుల మంజూరులో అభ్యంతరం వ్యక్తం కాలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. సాధారణంగా ఎవరైనా అధికారులు విదేశీ పర్యటనలకు వెళ్తే సంబంధిత శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నలుగురు సైతం అనుమతి తీసుకున్నారు. అయితే వీరిలో ఒకరు ఉన్నతాధికారి కాగా.. మిగిలిన ముగ్గురూ ఆయన పరిధిలోనే పనిచేస్తుండటం గమనార్హం. సాధారణ శాఖల్లోనే ఇలా ఒకే ప్రాంతంలో పనిచేసే అధికారులకు ఒకేసారి సెలవులు ఇవ్వరు. వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసేవారికి మాత్రం కలిసివెళ్లేందుకు అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో కీలక శాఖలో పక్కపక్కనే పనిచేస్తున్న అధికారుల మూకుమ్మడి సెలవులకు అనుమతినివ్వడం విస్మయకర అంశంగా మారింది. ఈ విదేశీ పర్యటన వెనక ఓ పేరుమోసిన లిక్కర్‌ సిండికేట్‌ పాత్ర ఉందని.. ఆర్థిక వనరులు సమకూర్చి ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లిక్కర్‌ సిండికేట్‌ వ్యాపారుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందుకే అధికారులకు నజరానా ప్రకటించి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అధికారులు కొంతకాలం క్రితమే ఈశాన్య రాష్ట్రాల పర్యటనకు వెళ్లివచ్చారు. తాజాగా మళ్లీ విదేశీ పర్యటనకు వెళ్లడం శాఖలో చర్చకు దారితీసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని