బడిబాట సరే.. బోధించే వారేరి?

రాష్ట్రంలో పాఠశాలలు ఈ నెల 12న పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదు కోసం విద్యాశాఖ ఈ నెల 3వ తేదీ నుంచి ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

Published : 09 Jun 2023 05:33 IST

సర్కారు బడుల్లో 15 వేల వరకు ఉపాధ్యాయ ఖాళీలు
అయినా విద్యాశాఖ మౌనం  
12న ప్రారంభం కానున్న పాఠశాలలు
ఈనాడు - హైదరాబాద్‌

* జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ధోనూర్‌ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు- మన బడి పథకం కింద డ్యూయల్‌ డెస్కులు, గ్రీన్‌ బోర్డులు సహా అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు. ఇక్కడ 101 మంది విద్యార్థులు ఉండగా ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం పిల్లల సంఖ్య ఆధారంగా నలుగురు ఉపాధ్యాయులు ఉండాలి.


* కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని సవరాన్‌ ఉన్నత పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో 130 మంది, ఆంగ్ల మాధ్యమంలో 200 మంది విద్యార్థులున్నారు. ఇంగ్లిష్‌, సోషల్‌ సబ్జెక్టులకు ఇద్దరు చొప్పున ఉండాల్సి ఉండగా ఒక్కొక్కరే ఉన్నారు.ఇక్కడ రూ.57 లక్షలతో మన ఊరు-మన బడి పనులు జరుగుతున్నాయి.


రాష్ట్రంలో పాఠశాలలు ఈ నెల 12న పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదు కోసం విద్యాశాఖ ఈ నెల 3వ తేదీ నుంచి ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మన ఊరు- మన బడి కార్యక్రమం కింద తొలి విడతలో రూ.3,497 కోట్లతో 9,145 పాఠశాలల్లో వసతులు కల్పిస్తుండటం, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం, యూనిఫాం పంపిణీ, పాఠ్యపుస్తకాలతోపాటు ఈసారి 6-10 తరగతుల విద్యార్థులకు నోటు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తుండటం వంటి అంశాలను బడిబాటలో ఇంటింటా ప్రచారం చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.  అంతా బాగానే ఉన్నా ఉపాధ్యాయుల కొరత నేపథ్యంలో విద్యాశాఖ సిబ్బంది గ్రామాల్లో తిరిగేందుకు తటపటాయిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఈ విషయాన్ని గ్రామస్థులు ప్రస్తావిస్తుండటంతో సమాధానం చెప్పలేక వెనుదిరుగుతున్న పరిస్థితీ ఉందని ఉపాధ్యాయులే చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26,074 ప్రభుత్వ పాఠశాలల్లో 15 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం 2022 మార్చిలోనే విద్యాశాఖలో 13 వేల ఖాళీలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించింది. అందులో 10 వేల వరకు ఉపాధ్యాయ ఖాళీలే ఉన్నాయి. ఆ ఖాళీల భర్తీ కోసమే 2022 జూన్‌లో టెట్‌ నిర్వహించింది. ఏడాది గడిచినా కనీసం ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. కనీసం ఆర్థిక శాఖ నుంచి ఖాళీల భర్తీకి అనుమతి కూడా పొందలేదు.

విద్యావాలంటీర్లూ లేరు

2020 మార్చి వరకు సర్కారు బడుల్లో 12 వేల మంది విద్యా వాలంటీర్లు పనిచేసేవారు. ఖాళీలు ఉన్న చోట అధికారులు వారి సేవలు వినియోగించుకునేవారు. గత మూడేళ్ల నుంచి వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోదు. అర్హులైన టీచర్లకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వకుండా, విద్యా వాలంటీర్లు లేకుండా సబ్జెక్టు నిపుణుల కొరత ఎలా తీరుతుందని ఉపాధ్యాయ సంఘాలు  ప్రశ్నిస్తున్నా ఫలితం లేకపోయింది. పైపెచ్చు ఒక సబ్జెక్టు నిపుణుడైన ఉపాధ్యాయునితో మరో సబ్జెక్టు చెప్పించడం, ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే వారిని హైస్కూళ్లకు డిప్యుటేషన్‌పై పంపి బోధించడం... తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉన్నా ఒకే టీచర్‌తో పాఠాలు చెప్పించడం...ఇలా విద్యాశాఖ ప్రయోగాలు చేస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో టీచర్లు లేకుండా ఎలా చదువు వస్తుందని బడిబాటలో తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారని పలువురు ఉపాధ్యాయులు ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

ఏకోపాధ్యాయ బడులు 6,392

రాష్ట్రవ్యాప్తంగా 6,392 ప్రాథమిక పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడే పనిచేస్తున్నారు. వారు సెలవు పెడితే చాలాచోట్ల బడికి సెలవు ఇవ్వాల్సిన పరిస్థితి. కనీసం ఇద్దరు టీచర్లనైనా ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ఎప్పట్నుంచో ఏకరవు పెడుతున్నాయి. ఇక శౌచాలయాలను శుభ్రం చేయడానికి, తరగతి గదులను ఊడ్చడానికి స్వచ్ఛ కార్మికులు లేరు.


టీచర్లు లేకుండా పాఠాలు చెప్పేదెలా..

- కటకం రమేష్‌, ప్రధాన కార్యదర్శి, టీఆర్‌టీఎఫ్‌

బడుల్లో వసతులను మెరుగుపరిచేందుకు తొలి విడతలో రూ.3,500 కోట్లు ఖర్చు చేస్తుండటం శుభపరిణామం. అంత చేసినా ఉపాధ్యాయులు లేకుండా పాఠాలు చెప్పేదెవరు? తల్లిదండ్రులు అదే విషయంపై ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి? తాత్కాలికంగా కనీసం 10 వేల మంది విద్యా వాలంటీర్లను నియమిస్తే బోధన గాడిన పడుతుంది. అందుకు రూ.150 కోట్లు ఖర్చు చేస్తే చాలు. ఆ దిశగా విద్యాశాఖ త్వరగా నిర్ణయం తీసుకోవాలి. అదే సమయంలో కొత్త నియామకాల నోటిఫికేషన్‌ జారీ చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని