రుతుపవనాలు వచ్చేశాయ్‌..

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు దేశంలోకి ప్రవేశించాయి. గురువారం ఇవి కేరళ, తమిళనాడు రాష్ట్రాలను తాకాయి.

Published : 09 Jun 2023 05:32 IST

కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోకి ప్రవేశం
15 నాటికి తెలంగాణలోకి..

ఈనాడు, హైదరాబాద్‌: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు దేశంలోకి ప్రవేశించాయి. గురువారం ఇవి కేరళ, తమిళనాడు రాష్ట్రాలను తాకాయి. 48 గంటల్లో ఈ రెండు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో విస్తరించి కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ విశ్లేషిస్తోంది. వాతావరణ శాఖ అంచనా వేసిన దానికంటే ఏడు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. జూన్‌ 1న తాకాల్సిన పవనాలు వాతావరణ మార్పులు, తుపాను కదలికల కారణంగా ఆలస్యంగా బయలుదేరాయి. ఇదే చురుకుదనంతో పవనాలు కదిలితే ఈ నెల 15వ తేదీ వరకు తెలంగాణను తాకే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. వాస్తవానికి జూన్‌ 10న తెలంగాణలోకి ప్రవేశించాల్సి ఉంది. ఉత్తర తెలంగాణలోని వివిధ జిల్లాల్లో శుక్రవారం వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో వీటి ప్రభావం ఉంటుందని తెలిపింది. శుక్ర, శనివారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం 12 జిల్లాల్లోని 39 మండలాల్లో వడగాలులు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే గరిష్ఠంగా కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాంలో 45.9 డిగ్రీలు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని