డేటా సెంటర్లకు రాచబాట

అంతర్జాతీయ డేటా కేంద్రాలకు హైదరాబాద్‌ హబ్‌గా మారుతోంది. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ లాంటి దిగ్గజ సంస్థలకు అమెరికా వెలుపల భారీ కార్యకలాపాలకు హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా మారుతోంది.

Published : 09 Jun 2023 05:32 IST

హబ్‌గా మారుతున్న హైదరాబాద్‌
అమెజాన్‌ కార్యకలాపాలు మొదలు
సిద్ధమవుతోన్న మైక్రోసాఫ్ట్‌ 3 కేంద్రాలు
ఆ కంపెనీ నుంచే రూ. 24 వేల కోట్లతో మరో మూడు
ప్రభుత్వంతో మరికొన్ని సంస్థల సంప్రదింపులు

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాతీయ డేటా కేంద్రాలకు హైదరాబాద్‌ హబ్‌గా మారుతోంది. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ లాంటి దిగ్గజ సంస్థలకు అమెరికా వెలుపల భారీ కార్యకలాపాలకు హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఆయా కంపెనీలు ఐటీ, దాని ఆధారిత కార్యకలాపాల కోసం భారీ పెట్టుబడులతో ప్రధాన డేటా కేంద్రాలను ఇక్కడ నెలకొల్పుతున్నాయి. దాదాపు రూ.21 వేల కోట్లతో అమెజాన్‌ వెబ్‌సర్వీసెస్‌ సంస్థ నిర్మించిన మూడు డేటా కేంద్రాల నుంచి ఇటీవల తొలిదశ కార్యకలాపాలు మొదలయ్యాయి. పలు దేశాలకు డేటా సర్వీసులు హైదరాబాద్‌ నుంచే అందుతున్నాయి. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే ప్రకటించిన మూడు డేటా కేంద్రాల నిర్మాణం జరుగుతుండగానే.. భారీ పెట్టుబడితో మరో మూడు డేటా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. త్వరలోనే వీటి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఎయిర్‌టెల్‌ కంపెనీ కూడా త్వరలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో పాటు దేశీయ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తమ డేటా కేంద్రాలను విస్తరిస్తున్నాయి. వీటిలో హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్లు సర్వర్ల నిర్వహణ, హార్డ్‌వేర్‌ సేవలు.. సర్వీసు ఆధారిత డేటా సెంటర్లు పలురకాల సేవలు అందిస్తాయి. వీటిపై ఆధారపడి పలు హార్డ్‌వేర్‌, అనుబంధ రంగాల పరిశ్రమల వృద్ధి జరుగుతుందని, తద్వారా ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఐటీశాఖ పేర్కొంటోంది.

నిరంతర విద్యుత్తు.. అందుబాటులో నీరు..

డేటా సెంటర్ల నిర్వహణకు విద్యుత్తు, నీళ్లు కీలకం. డేటా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో ఈ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ కేంద్రాల వరకు డేటా కనెక్టివిటీ కేబుల్‌ పటిష్ఠంగా ఉందని, సంబంధిత సంస్థల రక్షణాత్మక ఏర్పాట్ల మేరకు మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపాయి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని చందన్‌వెల్లి, మహేశ్వరంలోని ఫ్యాబ్‌సిటీ అంతర్జాతీయ డేటా కేంద్రాలకు చిరునామాగా మారుతున్నాయి. అత్యధిక డేటా కేంద్రాలు ఇక్కడే రానున్నాయి.

మైక్రోసాఫ్ట్‌: మైక్రోసాఫ్ట్‌ సంస్థ భారీ పెట్టుబడితో డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. తొలుత ప్రకటించిన మూడు కేంద్రాల నిర్మాణం 2022 జనవరిలో ప్రారంభమైంది. చందన్‌వెల్లి, ఎలికట్ట, మేకగూడలలో నిర్మితమవుతున్న ఆ కేంద్రాలు ఈ ఏడాది చివరి నాటికి పూర్తికానున్నాయి. మరో మూడు డేటా సెంటర్లను రూ.24 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

అమెజాన్‌: అమెజాన్‌ వెబ్‌సర్వీసెస్‌ రూ.21 వేల కోట్లతో రంగారెడ్డి జిల్లా చందనవెల్లి, ఫ్యాబ్‌సిటీ, ఫార్మాసిటీల్లో మూడు డేటా సెంటర్లను నిర్మించింది. 2020లో నిర్మాణ పనులు ప్రారంభించగా.. ఈ కేంద్రాల సేవలు గత నెల నుంచి అందుబాటులోకి వచ్చాయి. వీటిని మరింత విస్తరించాలని ఆ సంస్థ యోచిస్తోంది.

కంట్రోల్‌ ఎస్‌: దేశీయ సంస్థ కంట్రోల్‌ ఎస్‌ ఐటీ కారిడార్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ సంస్థలో రెండు వేల మందికిపైగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ డేటా కేంద్రాల విస్తరణకు ప్రణాళికలు రచిస్తోంది.


కోస్తా తీరాలను కాదని..

డేటా కేంద్రాలు ఎక్కువగా కోస్తా తీరాల్లో ఏర్పాటయ్యేవి. సముద్రగర్భ కేబుల్‌ కనెక్టివిటీ తదితర సానుకూలాంశాలే అందుకు కారణం. దేశంలో ముంబయి, చెన్నైలలో తొలుత ఈ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కానీ హైదరాబాద్‌కు డేటా కనెక్టివిటీ మెరుగ్గా ఉంది. ముంబయి, చెన్నై, దిల్లీ నగరాలతో పోల్చితే ఇక్కడ భూముల లభ్యత మెరుగ్గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం డేటా సెంటర్లకు ప్రత్యేక విధానంతో పాటు పన్ను రాయితీలు కల్పిస్తోంది. మానవ వనరుల లభ్యత, మౌలిక సదుపాయాలు, వివిధ పెట్టుబడులు.. వీటన్నిటి దృష్ట్యా ప్రముఖ సంస్థలు హైదరాబాద్‌ వైపు మొగ్గు చూపుతున్నాయి. దీంతో అంతర్జాతీయ క్లౌడ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా మారుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని