ఎక్కడి ఓటర్లకు అక్కడే ఓటు!

ఓటింగ్‌ శాతం పెంచే లక్ష్యంతో కరోనా నేర్పిన పాఠాలను ఎన్నికల ప్రక్రియలో అమలు చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది.

Published : 09 Jun 2023 04:10 IST

కాలనీ, బస్తీ పోలింగు కేంద్రాలపై గ్రేటర్‌లో అధ్యయనం

ఈనాడు, హైదరాబాద్‌: ఓటింగ్‌ శాతం పెంచే లక్ష్యంతో కరోనా నేర్పిన పాఠాలను ఎన్నికల ప్రక్రియలో అమలు చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ఒక వ్యూహాన్ని రూపొందించింది. ఏ ప్రాంతంలో ఓటరు ఆ ప్రాంతంలోనే ఓటు వేసేందుకు వీలుగా పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నది ఆ ఆలోచనగా ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 30 సర్కిళ్లలో 4,846 కాలనీలు/బస్తీలున్నాయి. మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2022 జనవరి నాటి జాబితా ప్రకారం 86.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే పోలింగు కేంద్రాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఒక ఇంట్లో ఉన్న ఓటర్లకు అదనంగా మరెవరైనా అర్హత పొందితే వారు మరో ప్రాంతంలోని పోలింగు కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. దీనిపై ఓటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కాలంలో ప్రజలకు టీకాలు ఇవ్వడం, పారిశుద్ధ్యం మెర్లుగుకు అమలు చేసిన కాలనీ/బస్తీ వ్యూహాన్ని పోలింగు కేంద్రాలకు వర్తింపజేసేందుకు అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

రెండు వార్డుల్లో కసరత్తు

గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని పోలింగు కేంద్రాలను, ఓటర్ల సంఖ్య ఆధారంగా వాటి సంఖ్యను ఖరారు చేస్తారు. పట్టణ ప్రాంతాల్లోనూ కాలనీ/బస్తీని ప్రామాణికంగా తీసుకుని పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న అంశంపై జీహెచ్‌ఎంసీలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న రెండు వార్డుల్లో ప్రయోగాత్మకంగా అధ్యయనం ప్రారంభించారు. మలక్‌పేట పరిధిలోని ఓల్డ్‌ మలక్‌పేట, ముషీరాబాద్‌ పరిధిలోని అడిక్‌మెట్‌ వార్డులను ఎంపిక చేశారు. 2022 జనవరి అయిదో తేదీ నాటి ఓటర్ల జాబితా ప్రకారం ఓల్డ్‌ మలక్‌పేట వార్డులోని 19 కాలనీ/బస్తీల్లో 56,128 మంది ఓటర్లు, అడిక్‌మెట్‌ వార్డులోని 22 కాలనీ/బస్తీల్లో 42,589 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారిని కాలనీ వారీగా వేరు చేసే ప్రక్రియను చేపట్టిన మీదట ఆయా ప్రాంతాల్లో ఎన్ని పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నది నిర్ధారిస్తారు. అదే ప్రాతిపదికన గ్రేటర్‌ పరిధిలోని అన్ని వార్డుల్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది.


ప్రత్యామ్నాయాలు అనివార్యం

ట్టణ ప్రాంతాల్లో పోలింగు కేంద్రాల పరిధిలో ఓటర్ల విషయంలో రాజకీయ పార్టీలు, ఓటర్ల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులకు పరిష్కారాన్ని గుర్తించేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే జీహెచ్‌ఎంసీలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. గ్రేటర్‌ అధికారులు కరోనా సమయంలో అనుసరించిన విధానాన్ని పోలింగు కేంద్రాలకూ అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.

 వికాస్‌రాజ్‌, ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని