చెరువంత సంబురం

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన చెరువుల పండుగ సంబురాలు మిన్నంటాయి.

Published : 09 Jun 2023 04:10 IST

వేడుకలకు వేదికలైన తటాకాలు
బతుకమ్మ ఆటలు, బోనాల సమర్పణ
రాష్ట్రవ్యాప్తంగా ‘చెరువుల పండుగ’ కోలాహలం
పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన చెరువుల పండుగ సంబురాలు మిన్నంటాయి. మండుటెండల్లోనూ జలకళతో తొణికిసలాడుతున్న తటాకాల వద్దకు జనం తరలివచ్చారు. బాణసంచా పేలుళ్లు, వలల ప్రదర్శనలతో వెల్లివిరిసిన ఉత్సాహంతో పండుగ వాతావరణం కనిపించింది. గ్రామాల్లో చెరువుల కట్టలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. కార్యక్రమాల అనంతరం ప్రజాప్రతినిధులు ప్రజలతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. గ్రామాల్లో మిషన్‌ కాకతీయ డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ అధికారులు ప్రగతి నివేదికలను ఆవిష్కరించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు... సత్యవతి రాథోడ్‌(మహబూబాబాద్‌), ఇంద్రకరణ్‌రెడ్డి(నిర్మల్‌), కొప్పుల ఈశ్వర్‌(కరీంనగర్‌), టి.హరీశ్‌రావు(సిద్దిపేట), జగదీశ్‌రెడ్డి(సూర్యాపేట), పువ్వాడ అజయ్‌కుమార్‌(ఖమ్మం) పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్సీ మురళీధర్‌, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పాండవుల చెరువుల వద్ద ఈఎన్సీ హరిరాం, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే పాల్గొన్నారు.

* నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం పురాణీపేట్‌లోని చెన్నచెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ సాధనకు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందనడానికి చెరువు గట్లపై ఊరూరా ఉత్సవాలు నిర్వహించుకోవడమే ప్రత్యక్షసాక్ష్యంగా నిలుస్తోందని భావోద్వేగానికి గురయ్యారు.

* కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడం కేసీఆర్‌కే సాధ్యమైందని పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 

* మిషన్‌కాకతీయతో చెరువులను పునరుద్ధరించడంతో అన్ని కాలాల్లోనూ చేపలు లభిస్తున్నాయని వనపర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

* కరీంనగర్‌ జిల్లాలో కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని అప్పనపల్లి చెరువు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాన్ని మంత్రి గంగుల కమలాకర్‌ ఆవిష్కరించారు.

* మేడ్చల్‌ నియోజకవర్గం శామీర్‌పేట్‌ పెద్ద చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు.

చెరువును కల్పతరువుగా మార్చిన నాయకుడు: కేటీఆర్‌

పదేళ్ల క్రితం ఏ చెరువును చూసినా గుండె బరువెక్కేది. నేడు ప్రతి చెరువూ కల్పతరువుగా మారిందని, గొలుసుకట్టు చెరువుల గోస తీర్చిన నాయకుడు సీఎం కేసీఆర్‌ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసిన మిషన్‌ కాకతీయ ఒక విప్లవమన్నారు. ఈ మహాయజ్ఞంలో మనసుపెట్టి పనిచేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

తెలంగాణ ఆచరిస్తుంది... దేశం అనుసరిస్తుంది: హరీశ్‌

మిషన్‌ కాకతీయ దేశానికే ఆదర్శమైందని, అమృత సరోవర్‌గా దేశవ్యాప్తంగా అమలువుతోందని, తెలంగాణ ఆచరిస్తే దేశం అనుసరిస్తుందనడానికి ఇది నిదర్శనమని మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌లో పేర్కొన్నారు. నాడు ఎండిపోయిన చెరువులు.. నేడు నిండు కుండల్లా ఉన్నాయని, నాటి పాలకులు గొలుసుకట్టు వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే మిషన్‌ కాకతీయతో కేసీఆర్‌ చెరువులను పునరుజ్జీవం చేశారని   కొనియాడారు.

మంత్రి గంగులకు త్రుటిలో తప్పిన ప్రమాదం

కరీంనగర్‌ కొత్తపల్లి, న్యూస్‌టుడే: మంత్రి గంగుల కమలాకర్‌కు గురువారం త్రుటిలో ప్రమాదం తప్పింది. చెరువుల పండుగలో భాగంగా కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌ చెరువులో ప్రయాణించేందుకు మంత్రి మర పడవలో కొంత దూరం వెళ్లారు. పడవ అదుపుతప్పి ఒకవైపు వంగిపోవడంతో మంత్రి చెరువులో పడిపోయారు. కరీంనగర్‌ రూరల్‌ సీఐ విజ్ఞాన్‌రావు, ఎస్సై ఎల్లయ్యగౌడ్‌, సహచరులు వెంటనే అప్రమత్తమై మంత్రిని ఒడ్డుకు తీసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని