సన్నద్ధత ఉంటేనే ‘ముందుకు’
పంటలను విపత్తుల బారి నుంచి కాపాడేందుకు పంటల సీజన్‌ను ముందుకు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకొని.. దీనిపై కార్యాచరణకు అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.
ఖరీఫ్ పంటకాలం జరగాలంటే ప్రత్యేక కసరత్తు అవసరమంటున్న నిపుణులు
ఈనాడు, హైదరాబాద్: పంటలను విపత్తుల బారి నుంచి కాపాడేందుకు పంటల సీజన్‌ను ముందుకు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకొని.. దీనిపై కార్యాచరణకు అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ వానాకాలం నుంచే దీన్ని అమలు చేయాలని సంకల్పించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే వ్యవసాయ శాఖకు, అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అయితే పంటల సీజన్‌లో మార్పులకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై చర్చ సాగుతోంది. రైతుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. ప్రభుత్వం అన్నివిధాలా సన్నద్ధమై.. రైతులను చైతన్యవంతులను చేస్తే ఫలితాలుంటాయని నిపుణులు, రైతుసంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో కొన్నేళ్లుగా యాసంగిలో అకాల వర్షాలు, వడగళ్లు పంటలను దెబ్బతీస్తున్నాయి. ఈ సీజన్‌లో దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అందులో 8 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింది. రైతుల కష్టాలను చూసిన సీఎం కేసీఆర్ సీజన్‌ను ముందుకు జరపాలనే నిర్ణయానికి వచ్చారు. యాసంగిలో వరికోతలు మార్చి 31 లోగా పూర్తయితే రైతులకు మేలు జరుగుతుందని సీఎం భావిస్తున్నారు. రాష్ట్రంలో సాగునీటి వసతి, భూగర్భ జలాల వృద్ధి, ఉచిత విద్యుత్ వంటి సానుకూల పరిస్థితులు ఉన్నందున వర్షాల కోసం చూడకుండా కాలువల నీళ్లతో వరినాట్లు వేసుకోవాలని నిర్దేశించారు. నవంబరు 15-20 లోగా యాసంగి వరినాట్లు వేసుకోవాలని సూచించారు. యాసంగి ముందుకు జరగాలంటే వానాకాలం వరినాట్లను కూడా ముందుకు జరపాలి. రోహిణీ కార్తె ప్రారంభంలోనే అంటే మే 25 నుంచి 25 జూన్ వరకు వానాకాలం వరినాట్ల ప్రక్రియ పూర్తి కావాల్సి వుంది. ఈ దిశగా జిల్లా కలెక్టర్లు రాష్ట్ర రైతాంగాన్ని వ్యవసాయ శాఖ సహకారంతో చైతన్యం చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ప్రచారం చేపట్టింది.
నైరుతి జాప్యంతో..
ముందస్తు పంట సీజన్‌కు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావించినా.. ఆరంభంలోనే రుతుపవనాలు ఆలస్యం కావడం లక్ష్యానికి ప్రతిబంధకంగా మారుతోంది. జూన్ 10 నాటికి విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉండగా.. వర్షపాతంలో లోటు ఏర్పడింది. మరోవైపు సీజన్‌ను ముందుకు జరపడంపై ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికను ప్రకటించలేదు. ముందస్తు సీజన్ అమలు చేయడానికి వీలుగా విత్తనాలు, ఎరువులను ఇప్పటికే సిద్ధం చేయాలి. ఇవి ఇంకా సమకూరలేదు. యాసంగికి సంబంధించిన ధాన్యం సేకరణ ఇంకా కొనసాగుతున్నందున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో గోదాములు ధాన్యం నిల్వలతో నిండి ఉన్నాయి. వాటిని ఖాళీచేసిన తర్వాత ఎరువులను నిల్వచేసే వీలుంది. మరోవైపు వర్షాలు ఆలస్యమయినా ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల కాలేదు. రైతుబంధును కూడా ముందుగా విడుదల చేయాల్సి ఉంది.
ఇబ్బందులున్నాయి..
- సముద్రాల కట్టమల్లు, రైతు, వరంగల్ జిల్లా
ప్రభుత్వం మా కోసమే అని చెబుతున్నా.. పంటల సీజన్‌ను ముందుకు జరపడానికి మాకు కొన్ని ఇబ్బందులున్నాయి. పంటలకు సమృద్ధిగా నీరుండాలి. మావద్ద ప్రాజెక్టులు లేవు. వర్షాధార భూమి. వర్షాలు పడకుండానే ముందే నాట్లువేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది.
పకడ్బందీ ప్రణాళికతోనే..
- బాసిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వ్యవసాయ నిపుణులు
ప్రభుత్వ ఉద్దేశం మంచిదే. దీన్ని ప్రాజెక్టుల కింద వెంటనే ప్రారంభించవచ్చు. మిగిలినచోట్ల సాధ్యం కాదు. రోహిణిలో నారుపోస్తే సీజన్ అనుకూలించదు. నెలలో కనీసం 5 సెంటిమీటర్ల వర్షపాతం పడితేనే భూములు పంటలకు అనుకూలిస్తాయి. అంటే జూన్ 30 వరకు వర్షాలు పడితే గానీ నేల అనుకూలంగా మారదు. ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో కృషి చేయాలి.
రైతుల మేలు కోసమే...
- ఎం.వెంకటరమణ, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు
రైతులను పంట నష్టాల బారి నుంచి కాపాడే బృహత్తర లక్ష్యంతోనే ప్రభుత్వం సీజన్‌ను ముందుకు జరపాలని సంకల్పించింది. ఇందులో వ్యవసాయ విశ్వవిద్యాలయం గురుతర బాధ్యతను నిర్వర్తిస్తుంది. రైతులు ఈ సీజన్ నుంచే దీనిపై దృష్టి సారించాలి. 120-125 రోజుల్లో పండే వరి రకాలను ఎంచుకొని ఈ నెల 15 నుంచి నెలాఖరు వరకు నారు పోసుకోవాలి. తర్వాత నెల రోజుల్లో నాట్లు వేసుకోవాలి. అది నవంబరు వరకు కోతకు వస్తుంది. ఒకవైపు పంట కోతలకు సన్నద్ధమవుతూనే యాసంగి కోసం నవంబరు 15 నుంచి 25 వరకు మళ్లీ నారు పోసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
-
Nizamabad: మాల్లో ఫ్రిజ్ తెరవబోయి విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
-
Bandaru: గుంటూరు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కు మాజీ మంత్రి బండారు