మహిళా మత్స్యకారులకు ఆర్థిక స్వావలంబన

రాష్ట్రంలోని మహిళా మత్స్యకారులంతా ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.

Published : 09 Jun 2023 04:10 IST

‘ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌’ ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని

రాంనగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని మహిళా మత్స్యకారులంతా ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను గురువారం ఎన్టీఆర్‌ స్టేడియంలో.. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడిన తర్వాత మత్స్యరంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. ఉచితంగా చేప, రొయ్య పిల్లల పంపిణీతోపాటు రూ.వెయ్యి కోట్లతో మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలు, ట్రాలీ ఆటోలు, ట్రక్కులను సబ్సిడీపై అందించామన్నారు. మృగశిర కార్తె సందర్భంగా మహిళా మత్స్యకారులు చేపలు, రొయ్యలతో చేసే వంటకాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న ఆలోచనతోనే.. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సుమారు 800 స్టాళ్లను ఏర్పాటు చేశామన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 600 మంది మహిళా మత్స్యకారులకు వివిధ వంటకాలపై శిక్షణ ఇచ్చామన్నారు.  అర్హులైన మత్స్యకారులకు వివిధ సొసైటీల్లో లక్ష వరకు సభ్యత్వాలు కల్పించనున్నట్లు చెప్పారు. అనంతరం ఎన్టీఆర్‌ స్టేడియంలోని స్టాళ్లనూ సందర్శించి.. చేపలు, రొయ్యలతో చేసిన ఫ్రై, బిర్యానీ, పకోడి, చేప పులుసు తదితర వంటకాలను పరిశీలించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని