చెన్నూరు కాదు.. తుమ్మిడిహట్టి మేలు

గ్రావిటీ ద్వారా ఆయకట్టుకు నీళ్లు వచ్చేందుకు అవకాశమున్న తుమ్మిడిహట్టి పథకాన్ని వదిలేసి చెన్నూరు ఎత్తిపోతల శంకుస్థాపనకు సీఎం కేసీఆర్‌ సిద్ధమయ్యారంటూ వివిధ సంఘాలు, పార్టీల నేతలు ఆక్షేపించారు.

Published : 09 Jun 2023 04:10 IST

అక్కడ నిర్మిస్తే ఆయకట్టుకు గ్రావిటీ ద్వారా నీరివ్వొచ్చు  
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: గ్రావిటీ ద్వారా ఆయకట్టుకు నీళ్లు వచ్చేందుకు అవకాశమున్న తుమ్మిడిహట్టి పథకాన్ని వదిలేసి చెన్నూరు ఎత్తిపోతల శంకుస్థాపనకు సీఎం కేసీఆర్‌ సిద్ధమయ్యారంటూ వివిధ సంఘాలు, పార్టీల నేతలు ఆక్షేపించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘గ్రావిటీతో నీళ్లు వస్తుంటే.. చెన్నూరు ఎత్తిపోతలకు సీఎం ఎందుకు శంకుస్థాపన చేస్తున్నారు?’ అనే అంశంపై తెలంగాణ జల సమితి ఆధ్వర్యంలో ప్రొ.వినాయకరెడ్డి అధ్యక్షతన అఖిలపక్షం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ జల సమితి నాయకుడు నైనాల గోవర్ధన్‌ చెన్నూరు ఎత్తిపోతలకు ప్రత్యామ్నాయంపై టోపో సర్వే ఆఫ్‌ ఇండియా పటాలతో ప్రదర్శన ఇచ్చారు. నెహ్రూ ప్రణాళిక ప్రకారం శ్రీరామ్‌సాగర్‌ ఉత్తర కాలువ రెండో దశ, ఎన్టీఆర్‌ శంకుస్థాపన చేసిన రెండో దశలోని మందాకిని కాలువతో చెన్నూరు ప్రాంతం అంతటికీ గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వవచ్చన్నారు. తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మాట్లాడుతూ... తుమ్మిడిహట్టిని మొదటే నిర్మించి ఉంటే రూ.1.25 లక్షల కోట్లు ఆదా అయ్యేవన్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ... ఖర్చు లేనటువంటి గ్రావిటీ పథకాలకు ప్రణాళికలు వేసే అవకాశమున్నా ప్రభుత్వం ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ కార్యదర్శివర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ నాయకులు కోదండరెడ్డి, విశ్రాంత ఇంజినీర్లు విఠల్‌రావు, లక్ష్మీనారాయణ, సీపీఐ నేత పశ్య పద్మ, ఆదిలాబాద్‌ అభివృద్ధి వేదిక అధ్యక్షుడు కొండేటి సత్యనారాయణ, తెలంగాణ లోక్‌సత్తా అధ్యక్షుడు మన్నారం నాగరాజు, విశ్రాంత ఆచార్యులు ప్రొ.వెంకటనారాయణ, బీసీ సంఘం నాయకులు శ్రీనివాస్‌ యాదవ్‌, జలసాధన సమితి నేత సారయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని