దివ్యాంగుల పింఛను రూ. 4,016

‘ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్‌ దేశాన్ని సగం ముంచితే.. భాజపా నిండా ముంచింది. సంక్షేమం, వ్యవసాయం ఛిద్రమయ్యాయి.

Published : 10 Jun 2023 05:27 IST

రూ. 1000 పెంచుతున్నాం  
మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్‌ ప్రకటన
వైద్యకళాశాల, చెన్నూరు ఎత్తిపోతల, మందమర్రి పామాయిల్‌ పరిశ్రమల నిర్మాణానికి శంకుస్థాపన
‘బీసీ కులవృత్తులకు చేయూత’, ఇళ్ల పట్టాల అందజేతకు శ్రీకారం
రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం
కాంగ్రెస్‌.. భాజపా దేశాన్ని ముంచాయని ఆరోపణ
వనరులున్నా.. అభివృద్ధి చేయలేదని ధ్వజం
మూడేళ్లు శ్రమించి ‘ధరణి’ని తెచ్చాం


నాకన్నా ముందు చాలా మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఏ రోజైనా ప్రజల గురించి ఆలోచించారా.. మూడేళ్ల పాటు చెమటోడ్చి ధరణి పోర్టల్‌కు రూపకల్పన చేశా. ధరణిని తొలగిస్తే రాజ్యం.. మళ్లీ దళారుల భోజ్యం అవుతుంది.

సీఎం కేసీఆర్‌


తెలంగాణకు ఈశాన్య ప్రాంతం మంచిర్యాల. పైగా ఈ రోజు మంచిరోజు. అందుకే ఒక్కో దివ్యాంగుడికి ఇచ్చే పింఛను ఇకపై రూ. 4016కు పెంచుతున్నాం. దళితులు, మైనార్టీలు, బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం ముందుకెళ్తుంది. మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించాల్సింది మీరే.

సీఎం కేసీఆర్‌


ఈటీవీ- ఆదిలాబాద్‌, న్యూస్‌టుడే - మంచిర్యాల పట్టణం: ‘ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్‌ దేశాన్ని సగం ముంచితే.. భాజపా నిండా ముంచింది. సంక్షేమం, వ్యవసాయం ఛిద్రమయ్యాయి. ఏ రాష్ట్రంలోనూ అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా జరగడం లేదు. దేశంలో వనరులు లేక కాదు.. ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోనందువల్లే అభివృద్ధి జరగడం లేదు’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజమెత్తారు. దేశంలోనే తెలంగాణను సుభిక్షంగా, తలమానికంగా తీర్చిదిద్దిన ఘనత ముమ్మాటికీ భారాసకే దక్కుతుందని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ఆయన నస్పూర్‌లో భారత్‌ రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయాన్ని, రూ. 41 కోట్లతో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో మాట్లాడిన సీఎం.. దేశాన్ని కాంగ్రెస్‌, భాజపా సర్వనాశనం చేశాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌, భాజపా చేస్తున్న గోల్‌మాల్‌ రాజకీయాలను అడ్డుకునేందుకే భారాసను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రగతికి, ప్రజా సంక్షేమానికి దిక్సూచిగా ఉన్న తెలంగాణ మాదిరిగానే మిగిలిన రాష్ట్రాలను తీర్చిదిద్దేందుకు భారాస ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. ప్రజలు దీవించాలని కోరారు.

సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం యత్నం

134 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణితో పాటు కోల్‌ ఇండియా పరిధిలో 361 బిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆస్ట్రేలియా, ఇండోనేసియాల నుంచి దిగుమతి చేసుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి చెందిన సింగరేణిపై చేసిన అప్పులు చెల్లించలేక కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రానికి 49 శాతం వాటా కల్పిస్తే, ఇప్పుడున్న మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశంలోని బొగ్గు నిల్వలను సద్వినియోగం చేసుకుంటే రాబోయే 150 ఏళ్లపాటు దేశమంతటా నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయొచ్చని వెల్లడించారు. సింగరేణి వజ్రపుతునక అని.. ఇనుము, మిగతా ఇతర గనుల తవ్వకాలు ఆ సంస్థ ఆధ్వర్యంలో చేపడతామని అన్నారు. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. 2014లో సింగరేణి టర్నోవర్‌ రూ. 11 వేల కోట్లుంటే భారాస అధికారంలోకి వచ్చిన తరువాత రూ.33 వేల కోట్లకు పెంచినట్లు వెల్లడించారు. అప్పట్లో రూ. 300-400 కోట్ల లాభాలు వస్తే తెలంగాణ ఏర్పడిన తరువాత రూ.2184 కోట్లకు చేరిందని తెలిపారు. ఇందులో రూ. 700 కోట్లను లాభాల వాటాగా సింగరేణి కార్మికులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సంస్థను ప్రైవేటీకరణ పేరిట తాళం వేయనిద్దామా అని ప్రజలను ప్రశ్నించారు.

పంజాబ్‌ కన్నా మనమే మిన్న

ఒకప్పుడు ధాన్యం పండించడంలో పంజాబ్‌ పేరు వినిపించేదని, ఇప్పుడు ఆ రాష్ట్రం కన్నా తెలంగాణ ముందు వరుసలో ఉందని సీఎం వెల్లడించారు. యాసంగిలో దేశవ్యాప్తంగా 94 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తుంటే ఒక్క తెలంగాణలోనే 56.40 లక్షల ఎకరాల్లో సాగవుతోందని వివరించారు. తలసరి ఆదాయం, విద్యుదుత్పత్తి, గ్రామీణ/పట్టణ ప్రాంతాలకు తాగునీటిలో తెలంగాణ మొదటిస్థానంలో ఉందని తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని వివరించారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైన విధానాల కారణంగా రూ.లక్ష కోట్ల విలువైన పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో 250 కి.మీ. గోదావరి తీరాన్ని సస్యశ్యామలం చేసినట్లు వివరించిన సీఎం.. రాబోయే రోజుల్లో ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, బెల్లంపల్లి నియోజకవర్గాలకు లక్ష ఎకరాల చొప్పున సాగునీరు అందించనున్నట్లు వెల్లడించారు.

వర్షంతో అంతరాయం

మంచిర్యాల సభకు వర్షం కొద్దిసేపు అంతరాయం కలిగించింది. ముందుగా నిర్ణయించినట్లు సీఎం హెలికాప్టర్‌ సాయంత్రం 5.15 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుంది. అప్పటికే ఈదురుగాలులతో వర్షం ప్రారంభం కావడంతో సభలో కలకలం మొదలైంది. సభావేదికపైకి సాయంత్రం 6.30 గంటలకు రావాల్సిన సీఎం కేసీఆర్‌ 7.13 గంటలకు వచ్చారు. భారాస మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ మాట్లాడిన తరువాత.. 7.17కు సీఎం ప్రసంగం మొదలు పెట్టి 7.50 నిమిషాలకు ముగించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఆద్యంతం మూడంచెల భద్రతతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో భారాస కార్యకర్తలు, సాధారణ జనం ఇబ్బంది పడ్డారు. సభ ముగిశాక రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ బయలుదేరిన సీఎం.. దారిలో గోదావరి నదికి హారతి ఇచ్చారు. నదిలో నాణాలు వేసి మొక్కారు. ముఖ్యమంత్రి పర్యటనలో మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, చిన్నయ్య, కోనప్ప, ఆత్రం సక్కు, జోగు రామన్న, దాసరి మనోహర్‌ రెడ్డి, రాఠోడ్‌ బాపురావు, రేఖానాయక్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎంపీ వెంకటేశ్‌ నేత, ఎమ్మెల్సీ దండే విఠల్‌, జడ్పీ ఛైర్‌పర్సన్లు నల్లాల భాగ్యలక్ష్మి, కోవ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాల్లోనూ గొర్రెల పంపిణీ ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం యాదవ, కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ పథకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంచిర్యాలలో దీన్ని ప్రారంభించగా.. పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.. విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో మొదలుపెట్టారు. ఇతర జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులు గొర్రెల పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. శనివారం నుంచి ఈ పథకం పంపిణీ కొనసాగనుంది. రెండో విడతలో రూ.6,085 కోట్లతో 3,37,816 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామని తలసాని తెలిపారు.


పథకాలకు శ్రీకారం

మంచిర్యాల పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు పథకాలకు శ్రీకారం చుట్టారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రూ. 1658 కోట్ల వ్యయంతో నిర్మించనున్న చెన్నూరు ఎత్తిపోతల పథకం, రూ. 500 కోట్లతో మందమర్రిలో చేపట్టనున్న పామాయిల్‌ పరిశ్రమ, రూ. 205 కోట్లతో నిర్మించనున్న వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. బీసీల్లోని చేతి కులవృత్తుల వారికి ఆర్థిక సాయం పథకాన్ని, రెండో విడత గొర్రెల పంపిణీ, భూమిలేని నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలను ముఖ్యమంత్రి మంచిర్యాలలో ప్రారంభించారు. జిల్లాలోని కోటపల్లి మండలం వెలమపల్లి గ్రామానికి చెందిన కుందారపు మురళి, భీమారం గ్రామానికి చెందిన మామిడి సత్యనారాయణలకు రూ.లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి.. తాండూరు మండలానికి చెందిన ఆవుల వెంకటేష్‌, బెల్లంపల్లి మండలం పాతబెల్లంపల్లివాసి గొలివేణి ఓదేలుకు పత్రాలను అందజేశారు. హాజీపూర్‌ మండలం దొనబండ గ్రామానికి చెందిన బిరుదుల లక్ష్మి, తోటపల్లి లావణ్యలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు.


5.16 లక్షల మందికి లబ్ధి

ఆసరా పథకం కింద రాష్ట్రంలో దివ్యాంగులకిచ్చే నెలవారీ పింఛను మొత్తాన్ని రూ. 3,016 నుంచి రూ. 4,016కి పెంచడంతో 5,16,890 మందికి ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకంలోని ఇతరులకు కూడా పింఛనును మరో రూ. 1000 పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సమయంలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఆసరాలో అన్ని వర్గాలు కలిపి 44,82,254 మందికి ప్రభుత్వం పింఛను ఇస్తోంది. దివ్యాంగులకు పింఛను పెంపుపై ఆ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హర్షం వ్యక్తం చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని