61 ఏళ్ల వయసు.. నిరక్షరాస్యత!

గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) క్రమబద్ధీకరణ తుది అంకానికి చేరుకుంది.

Updated : 10 Jun 2023 05:34 IST

వీఆర్‌ఏల క్రమబద్ధీకరణలో కీలక అంశాలివే
వారసులకు బదిలీ అవకాశాలపై తర్జనభర్జన
స్థానికతపై మరోమారు సమాచారం కోరిన సీసీఎల్‌ఏ

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) క్రమబద్ధీకరణ తుది అంకానికి చేరుకుంది. ఆయా జిల్లాల నుంచి వచ్చిన వీఆర్‌ఏల ఈ సమాచారాన్ని వడపోసే క్రమంలో పలు లోపాలను, అస్పష్టతను గుర్తించిన రెవెన్యూ శాఖ... డేటాను తిరిగి కొన్ని జిల్లాల కలెక్టర్లకు తిరిగి పంపినట్లు తెలిసింది. ఈ క్రమంలో 61 ఏళ్లు నిండిన వారిని ఏం చేద్దామనే దానిపై రెవెన్యూశాఖ తర్జనభర్జన పడుతోంది. విధుల్లో ఉన్న 20,200 మంది వీఆర్‌ఏలలో 60 ఏళ్లు నిండినవారు 4వేల మందికిపైగా ఉన్నట్లు అంచనా. వారి వారసులకు అవకాశం కల్పించాలనుకుంటే ఇప్పటికిప్పుడు సాధ్యమవుతుందా అనేదానిపైనా చర్చిస్తున్నట్లు తెలిసింది. దీనిపై వైద్య పరీక్షల అనంతరం నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవకాశమున్న మేరకు వీఆర్‌ఏలను కేటగిరీల వారీగా విభజించి వివిధ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు పరిశీలిస్తున్నారు. తమకు లస్కర్లు, సహాయకులుగా 5,678 మంది అవసరముందని నీటిపారుదల శాఖ నివేదిక ఇచ్చింది. ఇతర శాఖల్లోనూ సర్దుబాటు మార్గాలను వెతుకుతున్నారు.

3,300 మంది నిరక్షరాస్యులు

వీఆర్‌ఏల క్రమబద్ధీకరణలో విద్యార్హతలు కీలకంగా మారాయి. వీరిలో 3,300 మంది నిరక్షరాస్యులను గుర్తించినట్లు సమాచారం. దీంతోపాటు 2012లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఎంపికైన వీఆర్‌ఏలలో కొన్ని జిల్లాల్లోని వారికే వీఆర్వోలుగా పదోన్నతులు దక్కాయి. 2020లో వీఆర్వో వ్యవస్థ రద్దుతో 2,200 మందికి పదోన్నతులకు పైక్యాడర్‌ లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు రికార్టు అసిస్టెంట్‌/ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు ఇచ్చే సూచనలు ఉన్నాయి. వయసు సడలింపు అవకాశం ఇవ్వడంతో వీఆర్‌ఏలుగా ఎంపికై, ఇన్నేళ్లు విధులు నిర్వర్తించినందున దిగువ పోస్టులతో సరిపెట్టవద్దని వారు కోరుతున్నారు. గతంలో వారి బ్యాచ్‌కు చెందిన వారికి కేటాయించినట్లే జూనియర్‌ అసిస్టెంట్‌ సమాన స్థాయి పేస్కేలైనా ఇవ్వాలని విన్నవిస్తున్నారు.

స్థానికత వివరాలు ఏంటి?

క్రమబద్ధీకరణ ప్రక్రియ చివరిదశకు చేరిన నేపథ్యంలో వీఆర్‌ఏల స్థానికతపైనా జిల్లా కలెక్టర్లను సీసీఎల్‌ఏ తాజాగా అదనపు సమాచారం కోరారు. దీనికోసం వెబ్‌సైట్‌ ఏర్పాటు చేశారు. దీని ద్వారానే కలెక్టర్లకు చేరిన ప్రత్యేక ప్రొఫార్మాను తహసీల్దార్లకు పంపారు. వీఆర్‌ఏ పేరు, సొంత జిల్లా, మండలం, పనిచేస్తున్న గ్రామం, సొంత గ్రామం వివరాలతో అదనపు సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. గురువారం రాత్రిలోగా ఈ సమాచారాన్ని సీసీఎల్‌కు చేరవేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని