భావోద్వేగాలను గుర్తించే సాఫ్ట్‌వేర్‌

మనుషుల భావోద్వేగాలను గుర్తించే సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ పరిశోధకులు ధ్రువ్‌ శ్రీవాత్సవ, ఆదిత్యకుమార్‌ సింగ్‌, ప్రొఫెసర్‌ మకరంద్‌ తపస్విలు రూపొందించారు.

Updated : 10 Jun 2023 05:18 IST

ట్రిపుల్‌ఐటీ పరిశోధకుల అధ్యయనం

ఈనాడు, హైదరాబాద్‌: మనుషుల భావోద్వేగాలను గుర్తించే సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ పరిశోధకులు ధ్రువ్‌ శ్రీవాత్సవ, ఆదిత్యకుమార్‌ సింగ్‌, ప్రొఫెసర్‌ మకరంద్‌ తపస్విలు రూపొందించారు. సంతోషం, కోపం, నవ్వు.. ఇలా వేర్వేరు పరిస్థితుల్లో ఆయా వ్యక్తుల భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయి..? వారి మాటలు, ముఖకవళికల ద్వారా ఏం చెప్పదల్చుకున్నారు..? అనే అంశాలను మిషన్‌ లెర్నింగ్‌ సాఫ్ట్‌వేర్‌తో విశ్లేషించనున్నారు. కచ్చితత్వంతో చెప్పేందుకు పరిశోధకులు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ సినిమాలను ఎంచుకున్నారు. వాటిల్లోని వీడియోలను కంప్యూటర్‌కు అనుసంధానించగా.. మిషన్‌ లెర్నింగ్‌ సాఫ్ట్‌వేర్‌.. నటుల భావోద్వేగాలను విశ్లేషించి ఫలితాలను తెలిపింది. ఈ అధ్యయనాన్ని వాంకోవర్‌లో ఈ నెల 18 నుంచి జరగనున్న కంప్యూటర్‌ విజన్‌ సదస్సులో ప్రదర్శించనున్నారు.

సినిమా ప్రేరణతో..

* భారతదేశంలో సినిమా ప్రధానమైన వినోద సాధనం. తెరపై ఉన్న వారు నటిస్తున్నారని తెలిసినా.. సన్నివేశాలను బట్టి ప్రేక్షకులు నవ్వడం, ఏడవడం, కోప్పడటం చేస్తుంటారు.

* ఇతర భాషల సినిమాలు చూస్తున్నప్పుడు మాత్రం అర్థం కావు. సబ్‌టైటిల్స్‌ చదువుతూ చూసినప్పుడు భావోద్వేగాన్ని అర్థం చేసుకోగలరు.

* ఆయా సందర్భాల్లో మనుషుల మాటలు, ముఖకవళికల ద్వారా వారి భావోద్వేగాలను తెలుసుకునేందుకు ‘‘హౌ ఫీల్‌ ఇన్‌’’ పేరుతో పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఇందుకోసం మిషన్‌ లెర్నింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఎంచుకున్నారు.

* ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా భావోద్వేగాల తీరును మూవీ గ్రాఫ్‌ ద్వారా విశ్లేషించారు. ఒక వ్యక్తి సంభాషిస్తున్న వీడియోలో అతని భాష మనకు తెలియకపోయినా.. భావోద్వేగాలను అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. నవ్వడం, ఏడవడం, కోప్పడ్డం వంటివి వెంటవెంటనే వ్యక్తపరచినా అర్థం చేసుకునేలా ఏడు ప్రాథమిక భావోద్వేగాల సాఫ్ట్‌వేర్‌ను సృష్టించారు. 

* నిజాయతీ, సహాయం వంటి అంతర్లీన భావోద్వేగాలను మాత్రం గుర్తించలేదని పరిశోధకులు మకరంద్‌ తపస్వి తెలిపారు. ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రేమిస్తున్నానని చెబుతూ.. మనసులో ద్వేషిస్తుంటే కంప్యూటర్లు అయోమయానికి గురయ్యే అవకాశాలున్నాయని వివరించారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పరిశోధనలు చేస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని