మావోయిస్టు ఉద్యమానికి వృద్ధాప్యం దెబ్బ

మావోయిస్టు ఉద్యమాన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టులకు తోడు అగ్రనాయకత్వం వృద్ధాప్యంతో సతమతమవుతోంది.

Updated : 10 Jun 2023 05:41 IST

అనారోగ్య సమస్యలు, అగ్రనేతల మరణాలతో కుదేలు
తగ్గిపోతున్న తెలంగాణ ప్రాతినిధ్యం

ఈనాడు, హైదరాబాద్‌: మావోయిస్టు ఉద్యమాన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టులకు తోడు అగ్రనాయకత్వం వృద్ధాప్యంతో సతమతమవుతోంది. దీనికి తోడు నియామకాలు లేకపోవడంతో ఉద్యమం నానాటికీ బలహీనపడుతోంది. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌ గత నెల 31న అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. 50 ఏళ్లపాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన చాలాకాలం శ్వాసకోశవ్యాధి, మధుమేహం, అధికరక్తపోటుతో బాధపడ్డారు. కీలకపాత్ర పోషిస్తున్న అగ్రనాయకులంతా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. మావోయిస్టు పార్టీకి ఇప్పుడు ఇదే పెనుసవాలుగా మారింది. మావోయిస్టు ఉద్యమానికి ఒకప్పుడు తెలంగాణ కేంద్రస్థానంగా ఉండేది. సుదీర్ఘకాలం కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి సహా కేంద్ర కమిటీలోని 20 మంది సభ్యుల్లో 9 మంది తెలంగాణకు చెందిన వారే.

వీరిలో తిప్పిరి తిరుపతి, గాజర్ల రవి అలియాస్‌ గణేష్‌, మోడెం బాలకృష్ణ తప్ప మిగతా వారంతా 60 ఏళ్లకు పైబడ్డ వారే. గణపతి వయసు 72 ఏళ్లు కాగా మల్లా రాజిరెడ్డి వయసు 70 ఏళ్లు. ఇంకా మల్లోజుల వేణుగోపాల్‌, కడారి సత్యనారాయణ, పాక హనుమంతు, పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్నల వయసు 60కి పైమాటే. వీరంతా వృద్ధాప్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇప్పటికే అనారోగ్యం కారణంగా కేంద్ర కమిటీ సభ్యులు రావుల శ్రీనివాస్‌ అలియాస్‌ రామన్న, యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌లతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే చనిపోయారు. తాజాగా కటకం సుదర్శన్‌ మరణంలో ఇంచుమించు రెండేళ్ల వ్యవధిలో అనారోగ్యంతో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఇప్పుడు కేంద్ర కమిటీలో తెలంగాణకు చెందిన తొమ్మిది మందిలో దాదాపు అందరూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల లొంగిపోయిన ఓ మహిళా మావోయిస్టు వెల్లడించారు. కీళ్లనొప్పులు, మధుమేహం, రక్తపోటు అతి సాధారణమని, సరైన ఆహారం దొరకదని, ఇక ఎంత అత్యవసరమైనా వైద్యం అందటం కష్టమని ఆమె వివరించారు.

గత్యంతరం లేని పరిస్థితుల్లో అడవుల్లో దొరికే మూలికావైద్యంతో సరిపెడుతుంటారని, దానివల్ల పెద్దగా ఉపశమనం ఉండదన్నారు. అందుకే ఒకరిద్దరు తప్ప మిగతా కేంద్ర కమిటీ సభ్యులు ప్రయాణాలు చేయరని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకొని పార్టీకి దిశానిర్దేశం చేస్తుంటారని ఆమె వివరించారు. ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమంలో తెలంగాణకు చెందిన అజ్ఞాతంలో ఉన్న కేడర్‌ సంఖ్య సుమారు 120. వీరిలోనూ చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ వృద్ధాప్యం కారణంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతుండటంతో దాని ప్రభావం ఉద్యమంపై పడుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని