Nalgonda: 11 నెలలుగా...జీవచ్ఛవంలా..!.. ఆకతాయిల దాడే కారణం

నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని సాయిరెడ్డిగూడకు చెందిన ఇతని పేరు వెంకటేశ్‌ గౌడ్‌ (26). డిగ్రీ చదివాడు.

Published : 11 Jun 2023 07:42 IST

నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని సాయిరెడ్డిగూడకు చెందిన ఇతని పేరు వెంకటేశ్‌ గౌడ్‌ (26). డిగ్రీ చదివాడు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతూనే హైదరాబాద్‌లో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేసేవాడు. పోలీస్‌ ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలబడాలని కలలు కనేవాడు. కానీ...గత సంవత్సరం జులై 21న క్యాబ్‌ మాట్లాడుకున్న వ్యక్తి కిరాయి ఇవ్వకపోగా 20 మంది స్నేహితులతో కలిసి చితకబాదాడు. అంతటితో ఆగక తన గొలుసు చోరీ చేశాడంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వారు రాత్రంతా ఠాణాలో కూర్చోబెట్టారు. మరుసటి రోజు ఉదయం వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఆ వెంటనే అతను కోమాలోకి వెళ్లాడు. 11 నెలలుగా ఇలా జీవచ్ఛవంలా ఉన్నాడు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించగా ఇప్పటివరకు రూ.70 లక్షల వరకు ఖర్చయిందని తండ్రి అంజయ్యగౌడ్‌ తెలిపారు.

అయిదు నెలలుగా కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో చికిత్స చేయిస్తున్నామని, నెలకు రూ.2 లక్షల వరకు ఖర్చవుతోందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను సైతం గుర్తించలేని దీనస్థితిలో ఉన్నాడన్నారు. తమకు ఇంత అన్యాయం జరిగినా ఉన్నతాధికారులు కానీ, నేతలు కానీ ఎలాంటి సహాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరాయి డబ్బులు అడిగినందుకు ఇదంతా జరిగిందని.. దాడికి పాల్పడిన ఆకతాయిలు బెయిల్‌ తీసుకొని బయట తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘చికిత్స కోసం ఉన్న రెండెకరాల పొలం అమ్మేశాం. ఇంటిని అమ్మకానికి పెట్టాం. అప్పులు పుట్టే పరిస్థితి కనిపించడం లేదు. ముగ్గురు కుమార్తెల తర్వాత పుట్టిన కొడుకు మాకు అండగా ఉంటాడని అనుకున్నాం. ఇప్పుడు మంచానికి పరిమితం అయ్యాడు’ అంటూ అంజయ్యగౌడ్‌ కంటితడి పెట్టుకున్నారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, కుమారుడి చికిత్సకు దాతలు స్పందించాలని వేడుకుంటున్నారు.

న్యూస్‌టుడే, రాజేంద్రనగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని