మిడ్‌మానేరుపై రోడ్‌ కం రైలు వంతెన!

హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ను కలిపేలా మనోహరాబాద్‌-కొత్తపల్లి రైలుమార్గంలో మిడ్‌మానేరుపై రోడ్‌ కం రైలు వంతెన నిర్మాణం జరిగేలా చూడాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది.

Published : 19 Sep 2023 01:07 IST

మనోహరాబాద్‌-కరీంనగర్‌ నూతన రైలు మార్గంలో..
సిద్దిపేట-సిరిసిల్ల వరకు పూర్తయిన భూసేకరణ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ను కలిపేలా మనోహరాబాద్‌-కొత్తపల్లి రైలుమార్గంలో మిడ్‌మానేరుపై రోడ్‌ కం రైలు వంతెన నిర్మాణం జరిగేలా చూడాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆలోచనని రైల్వేశాఖ దృష్టికి తీసుకెళ్లింది. ఇటీవలే గజ్వేల్‌ నుంచి సిద్దిపేట వరకు నిర్మాణం పూర్తయిన ఈ లైన్‌పై అడపాదడపా గూడ్స్‌ రైళ్లు నడుస్తున్నాయి. మరోవైపు సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు భూసేకరణ పూర్తి కావడంతో నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. సిరిసిల్ల నుంచి వేములవాడ మీదుగా కొత్తపల్లి వరకు భూసేకరణ పూర్తి చేయాల్సి ఉంది. ఈ మార్గంలోనే మిడ్‌మానేరుపై రోడ్‌ కం రైలు వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. తొలుత మిడ్‌మానేరుపై కేవలం రైలు వంతెన నిర్మించాలని అనుకున్నారు. ఈ ప్రాజెక్టుపై జరిగిన చర్చలో మిడ్‌మానేరుపై రైలు వంతెనతో పాటు రోడ్డుమార్గం కూడా ఉంటే బాగుంటుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, మంత్రి కేటీఆర్‌ భావించారు. ఈ ఆలోచనకు సీఎం కేసీఆర్‌ కూడా అంగీకరించడంతో వినోద్‌కుమార్‌ రైల్వే అధికారులతో మాట్లాడారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి, వినోద్‌కుమార్‌, సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల కలెక్టర్లు ఈ అంశంపై సమావేశం కానున్నట్లు సమాచారం.


కీలకమైన ప్రాజెక్టు

కొత్తపల్లి-మనోహరాబాద్‌ అత్యంత కీలకమైన ప్రాజెక్టు. 151.36 కి.మీ. ప్రాజెక్టును రూ.1,981.64 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. దీనికయ్యే నిర్మాణ వ్యయంలో మూడింట ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన రెండొంతుల వ్యయం కేంద్రం ఇస్తుంది. భూసేకరణ ఖర్చు, మౌలిక వసతుల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. ఈ ప్రాజెక్టును యాన్యుటీ పద్ధతిలో చేపడుతున్నారు. ఇది అందుబాటులోకి వచ్చాక నష్టాలు వస్తే తొలి అయిదేళ్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో 13 స్టేషన్లు ఏర్పాటుకానుండగా.. సిద్దిపేట సమీపంలోని కొమురవెల్లిలోనూ స్టేషన్‌ నిర్మించాలని రైల్వేశాఖ తాజాగా నిర్ణయించింది. గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్లతో పాటు వేములవాడ, కరీంనగర్‌లను ఈ మార్గం అనుసంధానిస్తోంది. 21 భారీ వంతెనలు, 159 మైనర్‌ వంతెనలు, 7 ఆర్వోబీలు, 49 ఆర్‌యూబీలు రానున్నాయి. నిర్మాణపనులకు పధాని నరేంద్రమోదీ 7.8.2016న శంకుస్థాపన చేశారు. 2025 కల్లా మొత్తం ప్రాజెక్టును పూర్తిచేయాలన్నది లక్ష్యం.


కిలోమీటరు పొడవునా...

మిడ్‌మానేరుపై వంతెన వినూత్నంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోంది. కిందినుంచి రైలు మార్గం, పైనుంచి రోడ్డుమార్గం వెళ్లేలా నిర్మించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. రోడ్‌కం రైలు బ్రిడ్జి దాదాపు కిలోమీటర్‌  ఉంటుంది. ఈ వంతెన తంగెళ్లపల్లి మండలంలో ప్రారంభం అయ్యి వేములవాడలో ముగిసేలా ఆలోచన చేస్తున్నాం. రాజమహేంద్రవరంలో గోదావరిపై రోడ్‌ కం రైలు బ్రిడ్జి మాదిరి చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. కొత్తపల్లి-మనోహరాబాద్‌ మార్గం కేసీఆర్‌ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు మంజూరైంది. వేములవాడ, సిరిసిల్ల పట్టణాలు పెరగడం, అనేక కొత్తకాలనీలు రావడంతో ఈ ప్రాంతంలో రైలుమార్గం ప్రణాళికలో కొన్ని మార్పులు జరిగాయి. వేములవాడ కొత్త బస్టాండ్‌ అనుసంధానం అవుతుంది. భవిష్యత్తు అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని రెండో లైను కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తోంది. 

బోయినపల్లి వినోద్‌కుమార్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని