విమోచన దినోత్సవాలపైనా ఓటు బ్యాంకు రాజకీయాలు

ఓటు బ్యాంకు రాజకీయాలతో పార్టీలు తెలంగాణ స్వాతంత్య్రోద్యమ చరిత్రను సుదీర్ఘకాలం ప్రజలకు దూరం చేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.

Published : 19 Sep 2023 01:07 IST

తెలంగాణ స్వాతంత్య్రోద్యమ చరిత్రను ప్రజలకు దూరం చేశారు
రాజకీయ పార్టీలపై అమిత్‌షా ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: ఓటు బ్యాంకు రాజకీయాలతో పార్టీలు తెలంగాణ స్వాతంత్య్రోద్యమ చరిత్రను సుదీర్ఘకాలం ప్రజలకు దూరం చేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకూ సంకోచించాయన్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో ఆదివారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, భావితరాలకు తెలంగాణ స్వాతంత్య్ర పోరాటం గురించి చెప్పేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నించలేదని విమర్శించారు. తెలంగాణ చరిత్రను తప్పుగా చిత్రీకరించేందుకు, మరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్న వారికి ప్రజలే తగిన రీతిలో సమాధానం చెబుతారన్నారు. భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తినందించే లక్ష్యంతో ప్రధాని మోదీ సారథ్యంలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. తెలంగాణ స్వాతంత్య్ర పోరాటంలో అమరులైనవారికి శ్రద్ధాంజలి ఘటించడం, వారు కన్న కలలు నెరవేర్చేందుకు పునరంకితం కావడమే దీని వెనక లక్ష్యమని తెలిపారు.

‘‘నాటి హోంమంత్రి సర్దార్‌ పటేల్‌ లేకుంటే తెలంగాణ ప్రాంతం అంత త్వరగా భారతదేశంలో విలీనమయ్యేది కాదు. భారతదేశంలో అప్పటి హైదరాబాద్‌ రాజ్యం విలీనం కాకుండా స్వతంత్రంగా ఉంటే.. భారతమాత కడుపులో క్యాన్సర్‌ గడ్డ ఉన్నట్లేనని సర్దార్‌ పటేల్‌ అన్నారు. ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత దేశమంతా స్వాతంత్య్రం పొందినా ఇక్కడ మరో ఏడాది క్రూరమైన నిజాం పాలన కొనసాగింది. నిజాం పాలన, రజాకార్లతో 400 రోజులపాటు ప్రజలు నరకయాతన అనుభవించారు. తెలంగాణ విమోచన కోసం స్వామి రామానంద తీర్థ, ఎం.చెన్నారెడ్డి, కె.వి.నరసింహారావు, విద్యాధర్‌ గురు, పండిట్‌ కేశవ్‌ కోరట్కర్‌, అనభేరి ప్రభాకరరావు, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, కాళోజీ నారాయణరావు, దిగంబరరావు, షేక్‌ బందగీ, వామన్‌రావు నాయక్‌, వాఘ్మారే వంటి మహానుభావులు కృషి చేశారు. తెలంగాణ స్వాతంత్య్రోద్యమంలో ఆర్యసమాజ్‌, హిందూ మహాసభ వంటి ఎన్నో సంస్థలు, ఉస్మానియా వర్సిటీలో వందేమాతర ఉద్యమం కీలకపాత్ర పోషించాయి. జాతీయ జెండాను ఎగరవేసినందుకు పరకాలలో 1,500 మందిపై కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో పలువురు అమరులు కాగా.. ఎందరో గాయపడ్డారు.

మహారాష్ట్రలోని పర్భణీలో, కర్ణాటకలోని బీదర్‌లోనూ రైతులు, సామాన్య ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ కష్టాలకు, నిజాం, రజాకార్ల పాలనకు ముగింపు పలికేందుకు, దేశంలో తెలంగాణను విలీనం చేసేందుకు 1948 ఆగస్టు 10న పటేల్‌ సంకల్పించారు. సెప్టెంబరు 17 నాటికి ఆ లక్ష్యం నెరవేరింది. పోలీస్‌ చర్య ద్వారా తెలంగాణతోపాటు కల్యాణ కర్ణాటక, మరఠ్వాడా ప్రాంతాలను దేశంలో విలీనం చేశారు. భారత సైన్యం ‘ఆపరేషన్‌ పోలో’ ప్రారంభించిన తర్వాత ఒక్క రక్తం చుక్క కూడా నేల చిందకుండానే నిజాంను లొంగదీసుకుని తెలంగాణను దేశంలో విలీనం చేశారు. పటేల్‌, కేఎం మున్షీ సంయుక్తంగా ఈ బృహత్‌ కార్యక్రమం నిర్వహించారు. అమరులైన స్వాతంత్య్ర సమరయోధులు ఆకాంక్షించిన తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేద్దాం. 75 ఏళ్ల వరకు దేశంలోని ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ స్వాతంత్య్ర పోరాటానికి సరైన గౌరవం, గుర్తింపు ఇవ్వలేదు. మన పెద్దల పోరాటాన్ని స్మరించుకోవడం, స్వాతంత్య్ర సమరయోధులు కలలు కన్న రాష్ట్రాన్ని నిర్మించుకోవడమే కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల లక్ష్యం. స్వాతంత్య్ర పోరాటం స్ఫూర్తితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది’’ అని అమిత్‌షా అన్నారు.

ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

ప్రధాని మోదీకి అమిత్‌షా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ఠను పెంపొందించేలా ప్రధాని కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా అమిత్‌షా పేర్కొన్నారు. ‘‘మన దేశం అనేక విజయాలను సొంతం చేసుకుంది. ప్రపంచంలో దేశ ఆర్థిక వ్యవస్థ 2014లో 11వ స్థానంలో ఉండగా.. నేడు అయిదో స్థానానికి చేరింది. జీ20 ద్వారా భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, విశిష్టత ప్రపంచానికి మరోసారి తెలిశాయి. ప్రపంచమంతా మన దేశాన్ని ప్రశంసిస్తోంది. స్వాతంత్య్రయోధుల కలలను నెరవేరుస్తూ మోదీ నేతృత్వంలో దేశం ముందుకెళ్తోంది. చంద్రమండలంపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా కీర్తిని సొంతం చేసుకుంది. జీ-20 ద్వారా దేశ ప్రతిష్ఠ ప్రపంచ దేశాలకు తెలిసింది. ఆఫ్రికన్‌ యూనియన్‌ను జీ-20లో భాగస్వామ్యం చేసి.. జీ-21 చేసిన ఘనత మోదీదే’’ అని అమిత్‌షా తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని