ఆరు హామీల అభయ‘హస్తం’

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ పలు కీలక వాగ్దానాలు చేసింది. అధికారమిస్తే ఆరు గ్యారంటీ హామీలు అమలు చేస్తామని ప్రకటించింది. మహిళలు, రైతులు, యువత, గృహనిర్మాణం, విద్యుత్తు తదితర రంగాల్లో ఏం చేస్తామో ఆదివారం జరిగిన విజయభేరి సభ వేదిక నుంచి ప్రకటించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమరశంఖం పూరించింది.

Published : 19 Sep 2023 01:05 IST

మహిళలకు నెలకు రూ.2,500 నగదు సాయం  
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
రైతు భరోసా పేరిట ఎకరాకు రూ.15 వేలు
యువత చదువు, పేదల గృహ వసతికి భరోసా
విజయభేరి సభలో ప్రకటించిన కాంగ్రెస్‌
అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుకు హామీ

ఈనాడు హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ పలు కీలక వాగ్దానాలు చేసింది. అధికారమిస్తే ఆరు గ్యారంటీ హామీలు అమలు చేస్తామని ప్రకటించింది. మహిళలు, రైతులు, యువత, గృహనిర్మాణం, విద్యుత్తు తదితర రంగాల్లో ఏం చేస్తామో ఆదివారం జరిగిన విజయభేరి సభ వేదిక నుంచి ప్రకటించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమరశంఖం పూరించింది. ఆరు గ్యారంటీలతో కూడిన హామీలను కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీలతో పాటు, ముఖ్యమంత్రులు అశోక్‌గహ్లోత్‌, సుఖ్విందర్‌సింగ్‌ సుక్కు ప్రకటించారు. కాంగ్రెస్‌ అగ్రనాయకత్వంతో ప్రకటింపచేయడం ద్వారా ఈ గ్యారంటీలకు విశ్వసనీయత లభించినట్లయిందని రాష్ట్రంలోని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. కర్ణాటకలో 5 గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్‌.. అక్కడ అధికారంలోకి రాగానే హామీలు అమలు చేసిందని, తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్న కాంగ్రెస్‌ నాయకులంతా ఈ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. బహిరంగసభలో గ్యారంటీల గురించి మాట్లాడిన సోనియాగాంధీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. రాహుల్‌గాంధీ రాష్ట్రంలో అవినీతిని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందని, దీనికి కారణం ఒకరికొకరు సహకరించుకోవడమేనని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారాస, భాజపాలతో పాటు ఎంఐఎంను కలిపి అంతా ఒకటే అని రాహుల్‌ మాట్లాడగా, భాజపాకు భారాస ‘బి‘టీమ్‌ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ సమావేశాలు, బహిరంగసభ విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ వర్గాల్లో కొత్త జోష్‌ వచ్చినట్లయింది. మరోవైపు ఆరు గ్యారంటీలు కూడా అన్ని వర్గాలపైన ప్రభావం చూపేలా ప్రకటించింది. కర్ణాటకలో మహిళలకు నెలకు రూ.2 వేలు ప్రకటించగా ఇక్కడ మరో రూ.500 కలిపి రూ.2500కు పెంచింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం బెంగళూరులో మాత్రమే ఉచితం కాగా, ఇక్కడ రాష్ట్రమంతటా వర్తింపచేస్తామని ప్రకటించింది. రైతు భరోసా కింద తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తుండగా, రూ.15 వేలు ఇస్తామనడంతో పాటు.. దీన్ని కౌలు రైతులకూ వర్తింపచేస్తామంది. ఆరు గ్యారంటీలను ఒక కార్డుపై ముద్రించి పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతల సంతకాలతో ప్రతి ఇంటికీ పంపిణీ చేయాలని కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయించింది.


ఆరు గ్యారంటీ హామీలు ఇవే

1. మహాలక్ష్మి

  • మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సహాయం
  • రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌
  • ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

2. రైతుభరోసా

  • ఏటా రైతులకు ఎకరాకు రూ.15 వేలు.. కౌలురైతులకూ వర్తింపు  
  • వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు
  • వరికి మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్‌

3. ఇందిరమ్మ ఇళ్లు

  • ఇళ్లులేని కుటుంబాలకు ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి రూ.5 లక్షలు
  • తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం

4. గృహజ్యోతి

  • ప్రతి కుటుంబానికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

5. యువ వికాసం

  • విద్యార్థులకు రూ.5 లక్షల మేర విద్యా సంబంధ చెల్లింపులకు గాను విద్యాభరోసా కార్డు
  • ప్రతి మండలంలో ఇంటర్నేషనల్‌ స్కూల్‌

6. చేయూత

  • వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత కార్మికులు, ఎయిడ్స్‌, ఫైలేరియా వ్యాధిగ్రస్థులు, డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి నెలకు రూ.4 వేల పింఛను
  • పేదలకు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షలు ఆరోగ్య బీమా

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని