80 ఏళ్లు దాటినవారికి ఇంటి నుంచే ఓటు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు దాటినవారు ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

Published : 21 Sep 2023 05:07 IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అమలు
పోస్టల్‌ బ్యాలెట్లపై ఉత్తర్వులు జారీచేసిన ఎన్నికల సంఘం

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు దాటినవారు ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ సదుపాయాన్ని కోరుకున్నవారికి ముందస్తుగా పోస్టల్‌బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగానికి అవకాశం కల్పించాలని త్వరలో ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సమాచారాన్ని పంపింది. తెలంగాణలో ఈ ఏడాది చివరిలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పోస్టల్‌బ్యాలెట్‌ విధానంలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎవరు అర్హులన్న విషయమై ఎన్నికల సంఘం తాజాగా రాష్ట్రానికి సమాచారం పంపింది. 80 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు కేంద్ర బలగాల్లో పనిచేస్తున్నవారు, ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది, పోలింగు ఏజెంట్లు, ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులు ఇలా 11 రకాల వారికి పోస్టల్‌బ్యాలెట్‌ పత్రాలు సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. అయితే 80 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు కావాలనుకుంటే ఇంటినుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయి అభ్యర్థులు ఖరారయిన మీదట పోస్టల్‌ బ్యాలెట్లను అధికారులు సిద్ధం చేస్తారు. ఇంటినుంచి ఓటువేసే వారికి సంబంధించి ప్రత్యేక రంగులో బ్యాలెట్‌ పత్రాన్ని రూపొందించనున్నారు.

కాగా ఇంటినుంచి ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసేందుకు విధివిధానాలను ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు పంపనుంది. ఈమేరకు రానున్న ఎన్నికల్లో ఇంటినుంచి ఓటు విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకున్న వారు లిఖిత పూర్వకంగా ఆ ప్రాంత ఎన్నికల అధికారికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారులు ఆయా ఓటర్ల ఇంటికి వెళ్లి ఓటు వేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. నాగార్జునసాగర్‌, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లోనూ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ విధానాన్ని అమలు చేశారు. ఈ ప్రయత్నం ప్రయోజనకరంగా ఉండటంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి 5న విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 80 ఏళ్లు దాటిన ఓటర్లు రాష్ట్రంలో 4,87,950 మంది ఉన్నారు. వచ్చే నెలలో విడుదల చేసే తుది ఓటర్ల జాబితాలో ఇలాంటి ఓటర్లు ఎంతమంది ఉంటారన్నది స్పష్టం అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు