పాలమూరుపై ఏపీ దరఖాస్తు తిరస్కరణ

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుపై ఆంధ్రప్రదేశ్‌ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తు(ఐ.ఎ) పరిశీలన తమ పరిధిలోకి రాదని బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తేల్చిచెప్పింది.

Updated : 21 Sep 2023 05:04 IST

ఎత్తిపోతల పథకం తమ పరిధిలోకి రాదన్న బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌
డీపీఆర్‌ ఆమోదానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందని అంచనా వేస్తున్న తెలంగాణ నీటి పారుదల శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుపై ఆంధ్రప్రదేశ్‌ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తు(ఐ.ఎ) పరిశీలన తమ పరిధిలోకి రాదని బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తేల్చిచెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ దాఖలు చేసిన దరఖాస్తును తిరస్కరించింది. అయితే, దీనిపై సరైన వేదికకు వెళ్లే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు ఉందని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 75 శాతం నీటి లభ్యత కింద 90 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 18న జీఓ 246ను జారీ చేసింది. చిన్న నీటి వనరుల కింద కేటాయింపు ఉండీ వినియోగించుకోని 45 టీఎంసీలు, గోదావరి నుంచి పోలవరం ద్వారా కృష్ణా బేసిన్‌కు మళ్లించే నీటిలో నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న ప్రాజెక్టులకు  వినియోగించుకోవడానికి అవకాశం ఉన్న 45 టీఎంసీలు కలిపి మొత్తం 90 టీఎంసీలను పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయించింది. ఈ ఉత్తర్వును నిలిపివేసేలా మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట ఆంధ్రప్రదేశ్‌ మధ్యంతర దరఖాస్తు(ఐ.ఎ) దాఖలు చేసింది. మిషన్‌ కాకతీయ కింద చెరువులను మరమ్మతు చేసి మొత్తం నీటిని తెలంగాణ వినియోగించుకుంటోందని, కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు వివరాలే దీనికి సాక్ష్యమని పేర్కొంది. గోదావరి నుంచి మళ్లించే నీటిని కేటాయించుకోవడం వల్ల దిగువన ఉన్న రాయలసీమ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయంది. దీనిపై తెలంగాణ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ వాదన సరైంది కాదని అందులో పేర్కొంది. నీటిని మళ్లీ కేటాయించుకోవడం అక్రమమేమీ కాదని వాదించింది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన ప్రాజెక్టు తప్ప కొత్తది కాదని, 2016 సెప్టెంబరులో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ ప్రాజెక్టు గురించి చర్చ జరిగిందని, నిలిపివేయాలని అపెక్స్‌ కౌన్సిల్‌ చెప్పలేదంది.

రెండు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత ట్రైబ్యునల్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 2015లో ఇచ్చిన ఉత్తర్వులో వరద నీటి వినియోగమన్నారు తప్ప.. 75 శాతం నీటి లభ్యత కింద అని వినియోగించుకోవచ్చని పేర్కొనలేదంది. ఇది 2014లో జరిగిన రాష్ట్ర పునర్విభజనకు ముందు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు అన్న వాదనతోనూ ఏకీభవించలేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని యాక్ట్‌ 6 సెక్షన్‌ 89 ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తు తమ పరిధిలోకి రాదని ట్రైబ్యునల్‌ పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా కచ్చితమైన నీటి కేటాయింపులు జరగకపోతే చేయడం, నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఎలా వినియోగించుకోవాలో ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ రూపొందించడం మాత్రమే తమ పని అని స్పష్టం చేసింది. దీనిపై సరైన వేదికకు వెళ్లడానికి ఏపీకి స్వేచ్ఛ ఉందని పేర్కొంది. ట్రైబ్యునల్‌ ఆదేశాలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం పరిగణనలోకి తీసుకోవడానికి అవకాశం ఏర్పడిందని తెలంగాణ నీటిపారుదలశాఖ వర్గాలు భావిస్తున్నాయి. అటవీ, పర్యావరణ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ, కేంద్ర విద్యుత్తు ప్రాధికార సంస్థ తదితర అనుమతులు ఇప్పటికే వచ్చాయి. నీటి లభ్యతకు సంబంధించి సీడబ్ల్యూసీ అనుమతి రావాల్సి ఉంది.


ఇది పాలమూరు, రంగారెడ్డి ప్రజల విజయం

-మంత్రి నిరంజన్‌రెడ్డి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వం వేసిన మధ్యంతర దరఖాస్తును బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ కొట్టివేయడం పాలమూరు విజయమని, దీని ద్వారా ప్రాజెక్టుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదలే ఈ విజయానికి కారణమన్నారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటాను వెంటనే తేల్చాలని ఆయన డిమాండ్‌ చేశారు.


త్వరలో కాలువల పనులు

-మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌  

ఏపీ ప్రభుత్వం వేసిన మధ్యంతర దరఖాస్తును ట్రైబ్యునల్‌ కొట్టివేయడంతో ధర్మానిదే గెలుపు అని మరోసారి రుజవైందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. త్వరలో కాలువల పనులను చేపడతామని, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని