Madhapur Drug Case: నవదీప్‌పై కఠిన చర్యలొద్దు: హైకోర్టు

మాదక ద్రవ్యాల కేసులో నిందితుడైన సినీ నటుడు పల్లపోలు నవదీప్‌పై కఠిన చర్యలు తీసుకోరాదంటూ బుధవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 21 Sep 2023 07:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: మాదక ద్రవ్యాల కేసులో నిందితుడైన సినీ నటుడు పల్లపోలు నవదీప్‌పై కఠిన చర్యలు తీసుకోరాదంటూ బుధవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ దర్యాప్తులో భాగంగా నవదీప్‌ను విచారించాలనుకుంటే సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసు జారీ చేసి విచారణ చేపట్టవచ్చంది. గుడిమల్కాపూర్‌ పోలీసులు నమోదు చేసిన మాదక ద్రవ్యాల కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ నవదీప్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ కె.సురేందర్‌ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా తనను 29వ నిందితుడిగా పేర్కొన్నట్లు తెలిసిందని, అంతేగాకుండా పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నట్లు తెలిసిందన్నారు. పోలీసులు ఈ కేసులో సమర్పించిన రిమాండ్‌ నివేదికలో పిటిషనర్‌ను మాదకద్రవ్యాల వాడకందారుగా మాత్రమే పేర్కొన్నారని, సరఫరాదారుగా పేర్కొనలేదన్నారు. వాడకందారుకు చట్టంలో రక్షణ ఉందని, ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. ఒక నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం, నిందితుడితో ఉన్న ఒక మెసేజ్‌ ఆధారంగా కేసులో ఇరికించారన్నారు. అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సారా సుదర్శన్‌ వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ వినియోగదారో, సరఫరాదారో విచారణలోనే తెలుస్తుందన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి సీఆర్‌పీసీ 41ఏను అనుసరించాలని పోలీసులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు