సున్నా మార్కులొచ్చినా నీట్‌ పీజీ సీటు

నీట్‌ పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌లో మూడో రౌండ్‌కు సీట్ల ఎంపికలో మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 21 Sep 2023 07:01 IST

కటాఫ్‌ తొలగింపు... పరీక్షకు హాజరై ఉంటే చాలు

ఈనాడు, హైదరాబాద్‌: నీట్‌ పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌లో మూడో రౌండ్‌కు సీట్ల ఎంపికలో మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రౌండ్‌లో సీట్ల భర్తీకి అర్హత మార్కులను సున్నాగా పేర్కొంది. అన్ని కేటగిరీలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది. కటాఫ్‌ మార్కులను తొలగించిన నేపథ్యంలో మూడో రౌండ్‌లో పీజీ సీట్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎంసీసీ పేర్కొంది. ఇప్పటికే మూడో రౌండ్‌లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆప్షన్లను మాత్రం మార్చుకోవచ్చని సూచించింది. అర్హత పర్సంటైల్‌ను తగ్గించిన కారణంగానే మూడో రౌండ్‌లో సీట్ల కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించామంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్ణయం మేరకు అర్హత పరీక్షల మార్కులను సున్నాకు తగ్గించామంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌కు కటాఫ్‌ మార్కులను 291గా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 257, దివ్యాంగులకు 274గా పేర్కొని మొదటి రెండు రౌండ్‌లలో కన్వీనర్‌ కోటాలో సీట్లు భర్తీ చేశారు. తాజాగా అన్ని కేటగిరీల్లో సున్నా మార్కులు (నీట్‌ పీజీ పరీక్షకు హాజరై ఉంటే చాలు) పొందినా కౌన్సెలింగ్‌కు అర్హత ఉన్నట్లుగా నిబంధనలు మార్చారు.

మూడో రౌండ్‌కు అందుబాటులో 13 వేలకు పైగా సీట్లు

దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో కొన్ని పీజీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడంలేదని వైద్య విద్య నిపుణులు తెలిపారు. పారాక్లినికల్‌, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్త్రీ సహా పలు పీజీ కోర్సుల సీట్లు ఖాళీగా ఉంటున్నాయన్నారు. ఈ ఏడాది మొదటి రెండు రౌండ్ల కౌన్సెలింగ్‌ తర్వాత మూడో రౌండ్‌కు సీట్లు భారీగా మిగిలాయని తెలిపారు. మూడో రౌండ్‌ కౌన్సెలింగ్‌కు 13 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఎంసీసీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని