తెల్లకోటుపై ‘ర్యాగింగ్‌’ మరక

కొత్త కళాశాల.. చదవాల్సింది ఎంబీబీఎస్‌.. భిన్నమైన వాతావరణం.. వేర్వేరు ప్రాంతాల నేపథ్యం... మనసులో బెరుకు... పైగా తొలిసారిగా హాస్టల్‌లో ఉండాల్సిన పరిస్థితి... వంటివాటితో సతమతం అవుతున్న మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులను ర్యాగింగ్‌ భూతం మరింత భయపెడుతోంది.

Published : 24 Sep 2023 05:41 IST

వైద్య కళాశాలల్లో వికృత రూపం
కఠిన నిబంధనలున్నా బేఖాతరు
హింసాత్మకంగా కొందరు సీనియర్ల చేష్టలు
ఇప్పటికే రెండుచోట్ల 17 మందిపై వేటు
ఈనాడు - హైదరాబాద్‌

కొత్త కళాశాల.. చదవాల్సింది ఎంబీబీఎస్‌.. భిన్నమైన వాతావరణం.. వేర్వేరు ప్రాంతాల నేపథ్యం... మనసులో బెరుకు... పైగా తొలిసారిగా హాస్టల్‌లో ఉండాల్సిన పరిస్థితి... వంటివాటితో సతమతం అవుతున్న మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులను ర్యాగింగ్‌ భూతం మరింత భయపెడుతోంది. కొన్నిచోట్ల వికృత రూపం దాలుస్తోంది. రాష్ట్రంలోని అత్యధిక వైద్య కళాశాలల్లో సీనియర్‌ విద్యార్థుల వేధింపులు జరుగుతున్నా... శ్రుతిమించిన చోట మాత్రమే బహిర్గతం అవుతున్నాయి. అదుపు తప్పితే జీవితాలు తలకిందులవుతాయని ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నా... సీనియర్లు బేఖాతరు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ, వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కళాశాలల్లో చోటుచేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. పరిచయం పేరిట పలకరింపులు ప్రారంభిస్తూ... ప్రథమ సంవత్సరం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొంతకాలం సర్దుకుంటే సరిపోతుందని కొందరు భావిస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో బాధితులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తల్లిదండ్రులకు చెప్పుకోలేక, కళాశాలలో ఫిర్యాదు చేయలేక అల్లాడుతున్నారు. తాము చెప్పినట్లు వినకుంటే చేయి చేసుకోవడం లేదంటే విచిత్రమైన పనిష్మెంట్‌లు, కఠిన శిక్షలు వేస్తుండటంతో జూనియర్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. కొన్నిసార్లు మొదటి సంవత్సరం విద్యార్థులు, సీనియర్ల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి.

హాస్టళ్లలో... భరించలేని స్థాయిలో....

వసతి గృహాల్లో ర్యాగింగ్‌ బెడద ఎక్కువగా ఉంటోందని, రాత్రిపూట, సెలవు రోజుల్లో అక్కడ ఉండాలంటేనే భయపడుతున్నామని ప్రథమ సంవత్సరం విద్యార్థులు వాపోతున్నారు. సీనియర్ల చేష్టలు అవమానకరంగా, ఇబ్బందికరంగా, కొన్నిసార్లు హింసాత్మకంగా ఉంటున్నాయని జూనియర్లు చెబుతున్నారు. వేసుకున్న దుస్తులు, వాడుతున్న చెప్పులు, తలకట్టు, తల దువ్వుకునే విధానం, మాటలు, నడక సహా ప్రతి అంశంలోనూ ఇలా ఉండకూడదు, ఇలాగే ఉండాలంటూ సతాయిస్తున్నారని విద్యార్థినీ, విద్యార్థులు వాపోతున్నారు. అసభ్యకర పదజాలం ఉపయోగించడం, గోడకుర్చీ వేయించడం, గుంజీలు తీయించడం, మగపిల్లల దుస్తులు విప్పించడం, బయట నుంచి ఆహారం తేవాలని ఆదేశించడం, కొన్ని సందర్భాల్లో మద్యం తేవాలని ఒత్తిడి చేస్తున్న ఘటనలూ వెలుగు చూస్తున్నాయి. ఇంటర్‌లో వచ్చిన మార్కులు... నీట్‌ ర్యాంకుతో ఆరాలు ప్రారంభించి వ్యక్తిగత అంశాలు, ప్రవర్తనపై విచిత్రమైన ప్రశ్నలు సాధారణంగా మారాయి. హాస్టల్‌ రూంలకు వచ్చి వేధిస్తున్నారు. చెప్పులు తుడవాలని, షూపాలిష్‌ చేయాలని, ఆదేశిస్తారు. వారి రూంకు వచ్చి అసైన్‌మెంట్లు రాయాలని, అందుకు విముఖత చూపినా, సక్రమంగా రాయకున్నా దౌర్జన్యం చేయడం, కొట్టడం వంటివి చేస్తున్నారు.

నేరుగా ఫిర్యాదుకు అవకాశం

ప్రతి వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ నిరోధక బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఫిర్యాదులు ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపాళ్లకు మాత్రమే చేరేలా కంప్లయింట్‌ బాక్సులు పెట్టారు. మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసేందుకూ అవకాశముంది. ఎన్‌ఎంసీ, యూజీసీలకు నేరుగా ఫిర్యాదు పంపించేందుకు వీలు కల్పించారు. అన్ని కళాశాలల్లోనూ ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా బోర్డులు ఏర్పాటు చేశారు. వాటిపై వివిధ స్థాయుల్లోని అధికారులు, పోలీసుల ఫోన్‌ నంబర్లు రాస్తున్నారు.

ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో బహిర్గతం

గాంధీ వైద్య కళాశాలలో సీనియర్‌ విద్యార్థుల ర్యాగింగ్‌ శ్రుతిమించడంతో ఇటీవల జూనియర్లు నేరుగా యూజీసీకి ఫిర్యాదు చేశారు. విచారణలో ప్రథమ సంవత్సరం విద్యార్థుల గదుల్లోనే ర్యాగింగ్‌ జరిగినట్లు రూఢీ కావడం, తీవ్రత ఎక్కువగా ఉండటంతో పది మంది సీనియర్లను ఏడాదిపాటు సస్పెండ్‌ చేశారు. వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలోనూ ర్యాగింగ్‌కు పాల్పడిన ఏడుగురు సీనియర్లను మూడు నెలలపాటు తరగతుల నుంచి, ఏడాదిపాటు హాస్టల్‌ నుంచి బహిష్కరించారు. మరో 20 మందికి నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.


విద్యార్థుల చదువులపై ప్రభావం

తొలి సంవత్సరం విద్యార్థులు తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావాలని, సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని ఓ వైద్య కళాశాలలో మెంటార్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్‌ స్పష్టంచేశారు. అయితే, ర్యాగింగ్‌ భయంతో విద్యార్థులు మొదటి రెండు, మూడు నెలలు తరగతులకు సక్రమంగా హాజరు కావడంలేదన్నారు. భయం, ఆందోళన, ఒత్తిడి కారణంగా వారు చదువులపై దృష్టి సారించడం లేదని తెలిపారు. దీని ప్రభావం వారి తర్వాత చదువులపై పడుతోందని, మొదటి మూడు నెలల ఒత్తిడి తర్వాత కూడా కొనసాగి ఫస్టియర్‌ ఎంబీబీఎస్‌ ఫలితాలను ప్రభావితం చేస్తోందన్నారు. దీంతో మెరిట్‌ విద్యార్థులు కూడా మార్కుల్లో వెనుకబడి తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురవుతున్నారు.


కఠిన చర్యలకు అవకాశం

కళాశాలల్లో వేధింపులు ఏ రూపంలో ఉన్నా బాధ్యులు కఠిన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. జాతీయ వైద్య మండలి, యూజీసీ మార్గదర్శకాలతోపాటు పోలీసు చట్టాలు కూడా వర్తిస్తాయి. కళాశాల నుంచి, హాస్టల్‌ నుంచి పాక్షికంగా, పూర్తిగా తొలగించే వరకు శిక్షలు ఉంటాయి. అందుకే కొన్నిచోట్ల కళాశాలల బోధనా సిబ్బంది, ప్రిన్సిపాళ్లు... సీనియర్‌ విద్యార్థులను హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఒక వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ... తాము సీనియర్లను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నామని, వారిపై నిఘా పెడుతునామన్నారు. ప్రధానంగా వైద్య విద్యలో జూనియర్లకు... సీనియర్ల తోడ్పాటు, మార్గదర్శకత్వం అవసరమవుతాయని అందుకే కొన్ని సందర్భాల్లో హెచ్చరికలకే పరిమితం అవుతున్నట్లు తెలిపారు.


ర్యాగింగ్‌ ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదు
-కె.రమేశ్‌రెడ్డి, రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్‌ (డీఎంఈ)

వైద్య కళాశాలల్లో ర్యాగింగ్‌ ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఓడీలకు ఆదేశాలిచ్చాం. కళాశాలల్లో విద్యార్థులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూడాల్సిన బాధ్యత వారిదే.  ప్రతి విభాగంలోనూ ఫిర్యాదులను పరిష్కరించే విధానం పక్కాగా ఉండేలా చూస్తాం. ర్యాగింగ్‌కు పాల్పడితే కళాశాల నుంచి బహిష్కరించడమే కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకుంటున్న వాట్సప్‌ గ్రూపుల్లో ప్రొఫెసర్లు, హెచ్‌ఓడీలు భాగస్వాములుగా ఉండి  మెసేజ్‌లను పరిశీలిస్తున్నారు. కళాశాలలు, హాస్టళ్లలో ఎవరైనా విద్యార్థులు మద్యం తాగినా, మత్తు పదార్థాలు తీసుకున్నా... పూర్తిగా బహిష్కరిస్తాం. క్రమశిక్షణపరమైన చర్యలూ ఉంటాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని