అప్పీలుకు వెళతాం

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో అభ్యర్థులతోపాటు కమిషన్‌లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు పరీక్ష రాశామని, మూడోసారి రాయడమంటే తట్టుకోలేని వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థులు భయపడుతున్నారు.

Updated : 24 Sep 2023 07:25 IST

ఏకసభ్య ధర్మాసనం తీర్పుపై టీఎస్‌పీఎస్సీ  
న్యాయ నిపుణులతో సంప్రదింపులు
గందరగోళంలో అభ్యర్థులు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో అభ్యర్థులతోపాటు కమిషన్‌లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు పరీక్ష రాశామని, మూడోసారి రాయడమంటే తట్టుకోలేని వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థులు భయపడుతున్నారు. మరోసారి ప్రిలిమినరీ పరీక్ష అంటే లక్షల మంది అభ్యర్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతారని కమిషన్‌ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు అప్పీలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే న్యాయనిపుణులతో సమావేశమై సలహాలు తీసుకుంది. పూర్తి వివరాలతో సోమవారం అప్పీలు దాఖలు చేయనున్నట్లు తెలిసింది.

11 ఏళ్ల తర్వాత ప్రకటన

ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారి 2011లో గ్రూప్‌-1 ప్రకటన వచ్చింది. దాదాపు 11 ఏళ్ల అనంతరం.. శాసనసభలో నిరుటి మార్చిలో సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశాక 2022 ఏప్రిల్‌ 26న ఏకంగా 503 పోస్టులతో తెలంగాణలో తొలి గ్రూప్‌-1 ప్రకటనను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమ్స్‌ నిర్వహించగా 2,85,916 మంది హాజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ వీరి నుంచి 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని ఈ ఏడాది జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు వెలువరించింది. అనూహ్యంగా ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తొలిసారితో పోలిస్తే రెండోసారికి ఏకంగా 52 వేల మంది పరీక్ష రాయలేదు. అభ్యర్థులు మానసికంగా కుంగిపోవడమే ఇందుకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రెండోసారి నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించిన తుది కీని ప్రకటించిన కమిషన్‌.. 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌ కోసం అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఎదురుచూస్తోంది. ఈలోగా హైకోర్టు ప్రిలిమ్స్‌ను రద్దు చేసింది.

ఒక్కొక్కరిది ఒక్కో గాథ

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ కోసం అభ్యర్థులు రెండేళ్లుగా తీవ్రంగా కష్టపడుతున్నారు. ప్రతిష్ఠాత్మక ఉద్యోగాలకు ఒకేసారి భారీ సంఖ్యలో పోస్టులతో ప్రకటన రావడంతో ఉద్యోగార్థుల్లో కొందరు అప్పటికే తాము చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. కొందరు గ్రామాలను వదిలిపెట్టి నగరాలకు చేరుకున్నారు. వసతిగృహాల్లో ఉంటూ గ్రంథాలయాల్లో చదువుకుంటున్నారు. మరికొందరు భారీగా ఖర్చు చేస్తూ శిక్షణ తీసుకున్నారు. ఇంకొందరు సివిల్స్‌, ఇతర పోటీ పరీక్షలను కాదని దీని కోసమే సన్నద్ధమయ్యారు. ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమ్స్‌ రాశారు. పరీక్షలు రద్దవుతుండటంతో వారు విలువైన కాలాన్ని కోల్పోతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. మానసికంగా కుంగిపోతున్నారు.

  • ‘మూడేళ్లుగా సివిల్స్‌ శిక్షణ తీసుకుంటున్నా. గ్రూప్‌-1 ప్రకటన రావడంతో దాన్ని పక్కనపెట్టా. నిరుటి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించి మెయిన్స్‌కు ఎంపికయ్యా. ప్రధాన పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ప్రశ్నపత్రాల లీకేజీ పేరిట పరీక్ష రద్దు చేశారు. రెండోసారి మెయిన్స్‌కు సిద్ధమవుతుంటే మళ్లీ రద్దంటున్నారు. నా విలువైన సమయం వృథా అయింది’ అని మహబూబ్‌నగర్‌కు చెందిన జగదీశ్వర్‌ వాపోయారు.
  • ‘ఇంజినీరింగ్‌ పూర్తవగానే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఆఫర్‌ వచ్చింది. పేదరికం నుంచి వచ్చిన నేను గ్రూప్‌-1 ఉద్యోగం సాధించి ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నా. తొలిసారి క్వాలిఫై అయ్యా. రెండోసారి కూడా అర్హత సాధిస్తానన్న నమ్మకముంది. ఇప్పుడా పరీక్ష కూడా రద్దు అంటున్నారు. ఏం చేయాలో తోచడం లేదు’ అని హైదరాబాద్‌కు చెందిన కిషోర్‌ తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని