గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు

గ్రూప్‌-1 నియామకాల కోసం జూన్‌ 11న నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు శనివారం తీర్పు వెలువరించింది. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించడంలో కమిషన్‌ విఫలమైందని పేర్కొంది. 

Updated : 24 Sep 2023 07:23 IST

హైకోర్టు తీర్పు  
పరీక్ష తిరిగి నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీకి ఆదేశం
పరీక్షల నిర్వహణలో కమిషన్‌ వైఫల్యం
హాజరైన అభ్యర్థుల వివరాల నమోదులోనూ జాగ్రత్తల్లేవు
నోటిఫికేషన్‌లోని నిబంధనలు కమిషన్‌కూ వర్తిస్తాయి
వాటిని సవరించాలంటే అనుబంధ ప్రకటన ఇవ్వాలన్న న్యాయమూర్తి


బయోమెట్రిక్‌ నమోదుకుగాను అభ్యర్థులు పరీక్షకు 30 నిమిషాల ముందే చేరుకోవాలన్న ఒక నిబంధన నోటిఫికేషన్‌లో ఉంది. తాను పేర్కొన్న నిబంధనను కమిషన్‌ అమలు చేయాల్సి ఉంది. దీన్ని గత ఏడాది అక్టోబరు 16న జరిగిన పరీక్షల్లో అమలు చేశారు. ఈ ఏడాది జూన్‌ 11న విస్మరించారు.


టీఎస్‌పీఎస్సీ దాఖలు చేసిన కౌంటర్‌ పిటిషన్‌లోని మొదటి నివేదిక ప్రకారం పరీక్షకు హాజరైనవారి సంఖ్య 2,33,248గా ఉండగా జూన్‌ 28నాటి వెబ్‌నోట్‌ ప్రకారం వారి సంఖ్యను 2,33,506గా పేర్కొన్నారు. జులై 12న దాఖలు చేసిన కౌంటరులో 2,33,248గా సూచించారు. దీన్నిబట్టి పరీక్ష నిర్వహణలోగానీ, అభ్యర్థుల హాజరు వివరాలను సరిచూడటంలోగానీ కమిషన్‌ జాగ్రత్తలు తీసుకోలేదని స్పష్టమవుతోంది.

తీర్పులో న్యాయమూర్తి


ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-1 నియామకాల కోసం జూన్‌ 11న నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు శనివారం తీర్పు వెలువరించింది. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించడంలో కమిషన్‌ విఫలమైందని పేర్కొంది. పరీక్షలకు హాజరైన అభ్యర్థుల వివరాల నమోదులోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపించలేదని వ్యాఖ్యానించింది. గ్రూప్‌-1 పోస్టులకు నిర్ణయాత్మకమైన ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణలో వైఫల్యం కారణంగా అర్హులు అవకాశాలను కోల్పోరాదన్న ఉద్దేశంతోనే పరీక్షను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. బయోమెట్రిక్‌ సహా నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం పరీక్షను తిరిగి నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)ను ఆదేశించింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోకుండా, హాల్‌టికెట్‌ నంబరు లేకుండా ఓఎంఆర్‌ షీట్‌లు జారీ చేశారని, ఈ పరీక్షలను రద్దు చేయాలంటూ    బి.ప్రశాంత్‌, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్‌ పి.మాధవీదేవి శనివారం తీర్పు వెలువరించారు. నోటిఫికేషన్‌లో కమిషన్‌ జారీ చేసిన సూచనలు, నిబంధనలు అభ్యర్థులతోపాటు కమిషన్‌కూ వర్తిస్తాయని, వాటిని కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. నోటిఫికేషన్‌లో నిబంధనలను మార్చే అధికారం కమిషన్‌కు ఉందని, అలా చేయదలిస్తే గ్రూపు-4 పరీక్షల్లో మాదిరి అనుబంధంగా జారీ చేయవచ్చన్నారు. ప్రిలిమ్స్‌ అన్నది కేవలం స్క్రీనింగ్‌ పరీక్ష మాత్రమేనని, ఒకవేళ పరీక్షల నిర్వహణలో లోపాల కారణంగా కొందరు అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినప్పటికీ వారు మెయిన్స్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న కమిషన్‌ వాదన ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారంతా మెయిన్‌ పరీక్షకు హాజరు కాలేరని, మెరిట్‌ ఆధారంగా 1:50 నిష్పత్తిలో మాత్రమే అనుమతిస్తారన్నారని, దీనివల్ల మెరిట్‌ ఉన్న అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షలను కోల్పోయే అవకాశం ఉందన్నారు. జూన్‌ 11న జరిగిన ప్రిలిమ్స్‌కు పెద్దఎత్తున అభ్యర్థులు హాజరై మెయిన్స్‌కు సిద్ధమవుతున్నందున ప్రిలిమ్స్‌ అన్నది నిర్ణయాత్మక పరీక్షగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అందువల్ల మెరిట్‌ అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చూడాలన్న ఉద్దేశంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. బయోమెట్రిక్‌తో సహా నోటిఫికేషన్‌లో పేర్కొన్న అన్ని రకాల సూచనలు, నిబంధనలను అమలు చేస్తూ ప్రిలిమ్స్‌ పరీక్షను తిరిగి నిర్వహించాలని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఆదేశించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల వివరాలను ధ్రువీకరించుకోకుండా కమిషన్‌ దాఖలు చేసిన కౌంటరుపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌంటరుపై అసంతృప్తి వ్యక్తం చేయని పక్షంలో కోర్టు తన విధుల్లో విఫలమైనట్లేనని వ్యాఖ్యానించారు.

ప్రిలిమ్స్‌ కూడా కీలకమే

కమిషన్‌ కేవలం పరీక్షను మాత్రమే రద్దు చేసిందని, నోటిఫికేషన్‌ను రద్దు చేయలేదని, అందువల్ల నోటిఫికేషన్‌లోని నిబంధనను అమలు చేయాల్సిందేనని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారని న్యాయమూర్తి తెలిపారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా, ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు కమిషన్‌ పేర్కొంటోందన్నారు. ఇలాంటి ఆరోపణలను ఆధారాలతో నిరూపిస్తే తప్ప కోర్టు విచక్షణాధికారం కింద పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఒకరి బదులు మరొకరు (నకిలీ) రాసినట్లు నిర్దిష్ట ఆరోపణ లేకపోయినప్పటికీ నిర్వహణలో లోపాలతో ఇది జరిగే అవకాశం ఉందన్నది పిటిషనర్ల వాదన అని న్యాయమూర్తి పేర్కొన్నారు. కమిషన్‌ సమర్పించిన వివరాలను పరిశీలిస్తే అందులో లోపాలున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. సంతకాల్లో ఉన్న కొద్దిపాటి తేడాను పరీక్షల సమయంలో కనిపెట్టలేమని, ఈ పిటిషన్లు తప్ప.. పరీక్షల నిర్వహణపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే ప్రిలిమ్స్‌... ప్రాథమిక పరీక్ష మాత్రమేనని, నియామకానికి మెయిన్స్‌ కీలకమైందన్న అంశాన్ని ఈ కోర్టు పరిశీలించిందన్నారు. ప్రిలిమ్స్‌ ప్రాథమిక పరీక్ష అయినప్పటికీ నిర్ణయాత్మకమేనని, దీని నిర్వహణలో కమిషన్‌ వైఫల్యం కనిపిస్తోందన్నారు.


ఇదీ నేపథ్యం...

గ్రూప్‌-1లో పోస్టుల భర్తీకి 2022 ఏప్రిల్‌ 26న జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమ్స్‌ నిర్వహించారు. ప్రశ్నపత్రం లీకవడంతో దాన్ని రద్దు చేసి తిరిగి ఈ ఏడాది జూన్‌ 11న నిర్వహించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఒక నిబంధన ప్రకారం అభ్యర్థులు పరీక్షకు 30 నిమిషాలముందు హాజరై బయోమెట్రిక్‌ సిస్టమ్‌ ద్వారా ఫొటో, చేతి బొటనవేలి ముద్రలు ఇవ్వాల్సి ఉంది. 2022 అక్టోబరులో హాల్‌టికెట్లు జారీ అయినవారికి బయోమెట్రిక్‌లు తీసుకున్నారు. అయితే రెండోసారి పరీక్ష నిర్వహించినప్పుడు ఆ నిబంధనను విస్మరించారు. దీనివల్ల పారదర్శకంగా పరీక్షలు నిర్వహించలేదన్న ఆందోళన వ్యక్తమై వాటిని రద్దు చేయాలంటూ జూన్‌ 13న కమిషన్‌ ఛైర్మన్‌కు పలువురు వినతిపత్రం సమర్పించారు. దీనిపై నిర్ణయం తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని