‘ఆకర్షణ’ను చూసి గర్విస్తున్నా

‘చదువుకోవడం.. నేర్చుకోవడంలోని ఆనందాన్ని హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వ్యాప్తి చేస్తున్న విద్యార్థిని ఆకర్షణ సతీశ్‌ను చూసి గర్విస్తున్నా’ అని ప్రధాని అన్నారు.

Updated : 25 Sep 2023 06:55 IST

సేకరించిన 6 వేల పుస్తకాలతో 7 గ్రంథాలయాల ఏర్పాటు
మన్‌ కీ బాత్‌లో హైదరాబాద్‌ విద్యార్థిని అభినందించిన ప్రధాని మోదీ

ఈనాడు, హైదరాబాద్‌: ‘చదువుకోవడం.. నేర్చుకోవడంలోని ఆనందాన్ని హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వ్యాప్తి చేస్తున్న విద్యార్థిని ఆకర్షణ సతీశ్‌ను చూసి గర్విస్తున్నా’ అని ప్రధాని అన్నారు. మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ద్వారా మోదీ ఆమెను అభినందించారు. ఆకర్షణ చేసిన ప్రయత్నం గురించి ప్రధాని 2 నిమిషాల 7 సెకన్ల పాటు మాట్లాడారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఏడో తరగతి విద్యార్థిని ఆకర్షణ.. ఇరుగు పొరుగువారి నుంచి సేకరించిన 6 వేల పాత పుస్తకాలతో ఇప్పటివరకు 7 గ్రంథాలయాలను ఏర్పాటు చేసింది.   2021లో కొవిడ్‌ సమయంలో ఒక రోజు ఆకర్షణ తన తల్లిదండ్రులతో కలిసి ఆహారాన్ని అందించడానికి ఎంఎన్‌జే కేన్సర్‌ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులకు నొప్పి నుంచి ధ్యాస  పఠనం వైపు మళ్లడానికి పుస్తకాలు బహూకరించాలనే ఆలోచన వచ్చింది. అక్కడే తొలుత ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసింది. వచ్చేవారం సిద్దిపేటలో ఎనిమిదో గ్రంథాలయాన్ని మంత్రి హరీశ్‌ ప్రారంభించబోతున్నారు. అక్టోబరు 15న మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జయంతి నాటికి పదోది ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆకర్షణ తెలిపింది.


ఆకర్షణకు పేరు పెట్టింది అబ్దుల్‌ కలాం..

న కుమార్తెకు ఆకర్షణ అనే పేరు కలాం పెట్టారని తండ్రి సతీశ్‌కుమార్‌ గుర్తుచేసుకున్నారు. ఆయన అప్పట్లో కలాం దగ్గర విధులు నిర్వర్తించేవారు. ప్రస్తుతం ప్రైవేట్‌ హెల్త్‌ కేర్‌ సంస్థలో సీనియర్‌ మేనేజర్‌గా చేస్తున్నారు. అక్టోబరులో రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆకర్షణను కలుస్తానని మోదీ హామీ ఇచ్చారు. నిజామాబాద్‌లో కలుసుకునేలా అపాయింట్‌మెంట్‌ ఖరారు చేసే అవకాశం ఉందని సతీశ్‌ ‘ఈనాడు’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని