Hyderabad: రీజినల్‌ రింగు రోడ్డుకు మరో పీటముడి

హైదరాబాద్‌ రీజినల్‌ రింగు రోడ్డు నిర్మాణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొత్త అంశం తెరపైకొచ్చింది. ఇదో పీటముడిగా తయారవుతోంది.

Updated : 25 Sep 2023 09:16 IST

విద్యుత్తు, టెలికం కేబుళ్ల తరలింపు వ్యయంపై చర్చ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరోదఫా చర్చలు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ రీజినల్‌ రింగు రోడ్డు నిర్మాణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొత్త అంశం తెరపైకొచ్చింది. ఇదో పీటముడిగా తయారవుతోంది. రింగు రోడ్డు నిర్మాణం కోసం ఉత్తర భాగంలో ఉన్న విద్యుత్‌ వైర్లు, టెలికం కేబుళ్లు, అలాగే కొన్ని ప్రాంతాల్లో పైపులైన్లను తరలించాల్సి ఉంది. మొత్తం 158 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణానికి సుమారు 4,600 ఎకరాల భూ సేకరణ చేయాలి. రెవెన్యూ అధికారులు ఎన్నికల ప్రక్రియలో తలమునకలై ఉండటంతో ఆశించినంత వేగంగా భూ సేకరణ ప్రక్రియ సాగటం లేదు. అది కొలిక్కి వచ్చేటప్పటికి ఆ మార్గంలో ఉన్న కేబుళ్లను, పైపులైన్లను తొలగించాలి.  వాటి తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్రంకోరింది. కేంద్రమే భరించాలని రాష్ట్రం స్పష్టం చేస్తోంది.  

ఖర్చు ఎవరు భరించాలి?

రహదారిపై ఉన్న విద్యుత్‌ వైర్లు, టెలికం కేబుళ్ల వంటి వాటిని తరలించేందుకు సుమారు రూ.190 కోట్ల వ్యయం అవుతుందన్నది అంచనా. నిబంధనల మేరకు ఆ వ్యయాన్ని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖే భరించాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ అధికారులు చెబుతున్నారు. భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం ఖర్చును భరించేందుకు ఇప్పటికే అంగీకరించిన నేపథ్యంలో అదనపు భారాన్ని స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని వివరిస్తున్నారు. జాతీయ రహదారుల అధికారులతో నిర్వహించిన సంప్రదింపుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే విషయం స్పష్టం చేసినట్లు తెలిసింది. కనీసం 50 శాతాన్నైనా భరించాలనే ప్రతిపాదన రాగా దానికీ స్పందించలేదని సమాచారం. ఈ అంశంపై మరోదఫా   చర్చలు నిర్వహించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు